ఏటీఎం వాడకం.. రానున్న రోజుల్లో వణుకు తెప్పిస్తుందా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Jun 2020 10:15 AM IST
ఏటీఎం వాడకం.. రానున్న రోజుల్లో వణుకు తెప్పిస్తుందా?

బాగా జరిగిపోతున్న వాటిని కెలకటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. కానీ.. కొన్నిసార్లు ఏదో చేయబోయి.. మరేదో చేయటం.. చివరకు వ్యవహారం రచ్చగా మారటం చూస్తుంటాం. తాజాగా అలాంటి పనే ఆర్ బీఐ ఏర్పాటు చేసిన ఒక కమిటీ ఇదే పని చేయనుందా? అన్నది ప్రశ్నగా మారింది. ఏటీఎంలు సాధారణ ప్రజానీకం జీవితంలో భాగమయ్యాక.. దాని వాడకం మీద పరిమితులు విధించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. కానీ.. అలాంటివి పట్టించుకోకుండా ఆర్ బీఐ ఏర్పాటు చేసిన ఒక కమిటీ ఇప్పుడు సిత్రమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

తాజాగా కమిటీ చెబుతున్న విధివిధానాల్ని పాటిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు. ఈ కమిటీ చేయనున్న సూచనల్లో అత్యంత కీలకమైనది ఒకసారికి రూ.5వేలు మాత్రమే నగదు వచ్చేలా కట్టడి చేయటం ఇదే తరహాలోకి వస్తుంది. ఇవాల్టి రోజున డబ్బులు డ్రా చేసుకోవటం కోసం బ్యాంకుల కోసం వెళ్లటం చాలామంది మానేశారు. ఒక ఖాతాదారుడికి అతనికున్న బ్యాంక్ లిమిట్ కు తగ్గట్లు ఒకేసారి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు డ్రా చేసుకునే అవకాశం ఉన్నోళ్లు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఒకసారికి కేవలం రూ.5వేలు మాత్రమే డ్రా చేసుకోవటం అంటే కొత్త తిప్పలు షురూ అయినట్లే. అంటే.. రూ.50వేలుకావాలంటే.. పదిసార్లు ఏటీఎం వినియోగించాలి.

అదే సమయంలో.. అన్నిసార్లు ఏటీఎం వాడటం వల్లే అయ్యే టైంతో పాటు.. అన్నిసార్లు నగదు తీసుకోవటం ఇబ్బందిగా మారుతుందనటంతో సందేహం లేదు. ఒకవేళ రూ.5వేల పరిమితిని అమలు చేయకున్నా.. ఉచిత లావాదేవీల పరిమితి దాటినా ఛార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఏటీఎం వినియోగం పెరిగే కొద్దీ.. నిర్వహణ ఖర్చు పెరగొచ్చు. అదే జరిగితే.. ఏటీఎంలు ఉన్నాయన్న భరోసా కంటే భయమే పెరుగుతుంది. వాడే ప్రతిసారీ అంతో ఇంతో ఛార్జీల రూపంలో చెల్లించే వైఖరికి సామాన్యుడికి ఒక పట్టాన మింగుడుపడనిదిగా మారుతుందనటంలో సందేహం లేదు. మరేం చేస్తారో చూడాలి.

Next Story