జస్ట్ 15 రోజుల్లో జనాల్ని బాదేసిందెంతో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 8:46 AM GMT
జస్ట్ 15 రోజుల్లో జనాల్ని బాదేసిందెంతో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే

మహమ్మారికి చెక్ చెప్పాలంటే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అన్నంతనే చాలామంది సంతోషించినోళ్లు ఉంటే.. కొందరైతే ఏకంగా పండుగే చేసుకున్నారు. అయితే.. దాని ప్రభావం ఎంతలా ఉంటుందన్న విషయం లాక్ డౌన్ స్టార్ట్ అయిన మొదటి వారానికే అర్థమైంది. విషయం తెలీక తాము సంబరపడ్డ లాక్ డౌన్ ఇంత దారుణమైన ఫలితాలు తీసుకొస్తుందన్న వాస్తవాన్ని కోట్లాది మంది గ్రహించలేకపోయారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతినోళ్లు ఉన్నారు. మొత్తంగా చూస్తే.. 2020లో ఉన్న సున్నాల మాదిరే.. ఈ ఏడాది ఆదాయం సున్నా కాదు.. డబుల్ సున్నాగా తేల్చి చెబుతున్నారు.

సాధారణంగా విపత్తు ఏదైనా చోటు చేసుకుంటే.. దాని కారణంగా మీడియా పర్య్కులేషన్ పెరుగుతుంది. చానళ్లలో వీక్షకులు పెరుగుతారు. అందుకు భిన్నంగా.. కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలకు సైతం షాకిచ్చింది మాయదారి రోగం. తాను వస్తూనే.. న్యూస్ పేపర్లతో వైరస్ అంటుతుందన్న ప్రచారంతో.. దాన్ని వేయించటం బంద్ చేయించారు. దీంతో.. మహమ్మారిని తమను ముంచేస్తుందన్న అంచనా లేని మీడియా సంస్థలు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి.

గడిచిన యాభై ఏళ్లలో తాము ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదన్న మాట పలు మీడియా సంస్థలు చెబుతున్నారు. ఊహించని గడ్డు పరిస్థితితో ప్రకటనల ఆదాయంతో పాటు.. సర్య్కులేషన్ ఆదాయం సైతం దెబ్బ పడటంతో ఉద్యోగుల కోత మొదలు.. జీతాలకు చిల్లు పడింది. ఇలా మీడియాతో మొదలైన కోతల పర్వం అన్ని రంగాలకు పాకింది. ఇందుకు ప్రభుత్వాలు సైతం మినహాయింపు కాదు.

ఆ మధ్యన వరుస ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందంటూ వాపోవటం గుర్తుండే ఉంటుంది. ఇలా రాష్ట్రానికే కాదు.. కేంద్రానికి సైతం ఆదాయం తగ్గిపోయింది. లాక్ డౌన్ పాక్షిక్షంగా కొనసాగుతూ.. అన్ లాక్ 1.0 నడుస్తున్న వేళ.. ఆదాయం అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం నిధుల కొరతను అధిగమించేందుకు పెట్రోల్.. డీజిల్ మీద రోజువారీగా బాదుడు కార్యక్రమాన్ని షురూ చేశారు. చూస్తున్నంతనే డీజిల్ ధర డెబ్బైకి మూడు నాలుగు రూపాయిలు తక్కువగా ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు ఎనభైకి దగ్గరకు వచ్చేసిన దుస్థితి.

ఇలా పెద్ద ఎత్తున పెంచిన ధరల కారణంగా కేంద్రానికి సమకూరిన ఆదాయం ఎంతో తెలుసా? రూ.1.1 లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ఎక్సైజ్ పన్నురెండుసార్లు బాదేయటమే కాదు.. రోజువారీగా రేట్లను అంతకంతకూ పెంచేస్తున్న వైనంతో పెట్రోల్ మూల ధరపై 260 శాతం డీజిల్ మూల ధరపై 256 శాతం పన్నులు వసూలు చేస్తున్నట్లుగా లెక్కలు బయటకు వచ్చాయి. రాష్ట్రాలు సైతం తాము వసూలు చేసే వ్యాట్ ను పెంచేశాయి. ఇలా కేంద్రం.. రాష్ట్రాలు ఒకరిపై ఒకరుపోటీ పడి పెంచటం కారణంగా ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరింది కానీ.. ప్రజలకు మాత్రం వేదనతో విలవిలలాడిపోతున్నారు.

ఏది ఏమైనా కేవలం 15 రోజుల్లో దేశ ప్రజల నుంచి రూ.1.1లక్షల కోట్లు బాదేసిన మోడీ మాస్టారి తీరు చూస్తే.. మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా అందరికి దెబ్బ పడి కోలుకోవటానికి మరింత టైం పడుతుందన్న అంచనాలకు భిన్నంగా కేంద్రం తీరు ఉందని చెప్పక తప్పదు. ఏమైనా.. తాజా ధర పుణ్యమా అని కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరిందని మాత్రం చెప్పక తప్పదు.

Next Story