నిమిషం గడిస్తే మహారాష్ట్రలో ముగ్గురికి పాజిటివ్.. హైదరాబాద్ లో?
By సుభాష్ Published on 23 Jun 2020 6:00 AM GMTదేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో మహారాష్ట్రలో మాయదారి మహమ్మారి విరుచుకుపడుతోంది. దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబయిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అంతకంతకూ పెరిగిపోతున్న పాజిటివ్ కేసులతో శివసేన సర్కారుకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పాజిటివ్ లతో పాటు.. ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మరణాల సంఖ్య సైతం కలవరపాటుకు గురి చేస్తోంది. ఆ రాష్ట్రంలో మహమ్మారి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. వెల్లువలా పాజిటివ్ లు చోటు చేసుకుంటున్నాయి.
నిమిషం గడిస్తే చాలు దగ్గర దగ్గర ముగ్గురికి పాజిటివ్ లుగా నమోదవుతున్నారు. ఆరోగ్య శాఖ విడుదల చేసిన అధికారికి బులిటెన్ ప్రకారం సోమవారం ఒక్కరోజులో మహారాష్ట్రంలో మొత్తం 3721 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన చూస్తే.. ప్రతి నిమిషానికి 2.7 మందికి మహమ్మారి సోకినట్లుగా చెప్పాలి. దేశంలోని మిగిలిన రాష్ట్రాల్ని పక్కన పెడితే.. ఒక్క మహారాష్ట్రలోనే 1,35,796 మందికి పాజిటివ్ గా తేలింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 61,793 కాగా.. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 67,706గా చెబుతున్నారు.
అన్నింటికంటే విషాదకరమైన విషయం ఏమంటే.. సోమవారం మరణించిన 62 మందితో కలిపితే ఈ మాయదారి జబ్బుతో ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 6283 మంది కావటం గమనార్హం. ఇదిలా ఉంటే.. తెలంగాణలోనూ పరిస్థితి అంతకంతకూ ముదురుతోంది. సోమవారం ఒక్కరోజులో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం 872 మందికి పాజిటివ్ కాగా.. అందులో అత్యధికంగా 713 మంది గ్రేటర్ హైదరాబాద్ వాసులు కావటం గమనార్హం. ఈ లెక్కన చూస్తే.. ప్రతి రెండు నిమిషాలకు ఒకరు చొప్పున హైదరాబాద్ లో పాజిటివ్ బారిన పడుతున్నట్లుగా చెప్పాలి.
తాజా దూకుడు చూస్తే.. రానున్న కొద్ది రోజుల్లో ఇప్పటి పరిస్థితే కొనసాగితే.. ప్రతి నిమిషానికి ఒకరు చొప్పున పాజిటివ్ లు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8674కు చేరుకున్నట్లైంది. ఇప్పటివరకూ వివిధ ఆసుపత్రుల్లో కలిపి 4452 మంది చికిత్స పొందుతుండగా.. 4005 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. పాజిటివ్ నిర్దారణ కోసం చేస్తున్న పరీక్షా ఫలితాలు వణుకు తెప్పిస్తున్నాయి. సోమవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3189 మందికి పరీక్షలు నిర్వహించగా.. 872 మందికి పాజిటివ్ అని తేలింది. అంటే.. 27.34 శాతం. టెస్టుల సంఖ్య పరిమితంగా చేస్తుండటంతోనే.. ఇంత ఎక్కువ స్థాయిలో పాజిటివ్ లు నమోదవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు.