ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామి దంప‌తుల‌పై దాడి జరిగింది. అర్థరాత్రి ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి స్టూడియో నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా.. మార్గం మధ్యలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమ‌యిన‌ ఆర్నాబ్, సమియా గోస్వామి దంప‌తులు వారి నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు.

ఈ దాడిలో కారు దెబ్బ‌తిన‌గా.. అర్నాబ్ దంప‌తుల‌కు స్వ‌ల్ప‌గాయాల‌యిన‌ట్లు తెలుస్తుంది. జ‌రిగిన ఘ‌ట‌న‌పై అర్నాబ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వెంట‌నే స్పందించిన పోలీసులు.. దాడితో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన‌ట్లు ముంబై జోన్‌ 3 డీసీపీ ప్రకటించారు. వారిపై సెక్షన్ 504, 341 కింద కేసు నమోదు చేసిన‌ట్లు తెలిపారు.
ఇదిలావుంటే.. అర్నాబ్ రెండు రోజుల క్రితం ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకు రాజీనామా చేశారు. టర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాలో విశ్వ‌స‌నీయ‌త లోపించింద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. మహారాష్ట్రలోని పాల్‌ఘార్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై అల్ల‌రిమూక‌ల దాడి ఘ‌ట‌న‌పై చ‌ర్చా కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌గా మ‌ధ్య‌లోనే ‌అర్నబ్‌ రాజీనామా ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో అర్నాబ్‌పై దాడి తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ఇక దాడి జ‌రిగిన వెంట‌నే మాట్లాడిన అర్నాబ్.. దాడికి పాల్ప‌డింది కాంగ్రెస్ కార్య‌కర్త‌లేన‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్ద‌ల స‌పోర్టుతోనే వారు ఈ దాడికి పూనుకున్నార‌ని ద్వ‌జ‌మెత్తారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.