700 ఎకరాలున్న అప్పలరాజు పింఛన్ కోసం తిరుగుతున్నారెందుకు?
By న్యూస్‌మీటర్ తెలుగు
కొందరు చేసే తప్పులు సామాన్యులకు ఎంతటి కష్టానికి గురి చేస్తాయో తాజా ఉదంతాన్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. విజయనగరం జిల్లా కొత్త భీమసింగి ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల పట్నాల అప్పలరాజు నిరుపేద. వడ్రంగి పనులు చేస్తూ బతుకుబండిని భారంగా లాగుతున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని అతని బతుక్కి ఎలాంటి భరోసా లేని దుస్థితి. ఇలాంటివేళ.. సర్కారు సాయం కొంతైనా అసరాగా నిలుస్తుందన్న ఉద్దేశంతో పెద్ద వయస్కులకు ఇచ్చే పింఛను కోసం అప్లై చేశాడు.
ఈ సందర్భంగా అతడికో షాకింగ్ విషయం వచ్చింది. అతడి పేరు మీద ఆన్ లైన్ లో 700 ఎకరాల భూమి ఉన్నట్లుగా తేల్చారు. అధికారుల నోటి నుంచి వచ్చిన మాట విని నివ్వెరపోయాడు అప్పలరాజు. అంగుళం భూమి కూడా లేని తనకు ఏకంగా 700 ఎకరాలు ఉండటమా? అని అవాక్కు అయ్యాడు.
ఆన్ లైన్ లో రికార్డుల్ని నమోదు చేసే అధికారుల తప్పిదంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో.. అతగాడికి పింఛన్ రాని పరిస్థితి. ఎవరో చేసిన తప్పు తనను ఇబ్బంది పెడుతున్న వేళ.. ఆ తప్పును సరి చేసుకునేందుకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అప్పలరాజు.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం 700 ఎకరాల అసామి అయిన అతడు.. సర్కారు ఇచ్చే పింఛన్ డబ్బుల కోసం తిరుగుతున్న వైనం చూస్తే.. అయ్యో అనకుండా ఉండలేని పరిస్థితి. వరుస పెట్టి దరఖాస్తులు పెడుతున్న అప్పలరాజుకు అంగుళం భూమి కూడా లేదన్న నిజాన్ని అధికారులు తేల్చారు. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని మంజూరు చేయనున్నట్లు చెప్పారు. దీంతో.. ఇప్పటికైనా తనకు పింఛన్ వస్తుందని ఆశిస్తున్నాడా బడుగుజీవి.