'రాజముద్ర'ను మార్చేసిన ఏపీ సర్కార్.. కారణం ఇదేనా..?
By సుభాష్ Published on 16 April 2020 10:29 AM GMTఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో తనదైన ముద్రవేసేందుకు ముందుకు సాగుతున్నారు జగన్. పాలన పరంగా కూడా ఎన్నో కీలక మార్పులు తీసువచ్చారు. అదే విధంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించే మీటింగ్ హాల్‌లో సీఎం కుర్చీ వెనుక భాగంలో ఉండే బౌద్ధ ధర్మచక్ర స్థానంలో, రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సీఎంవో. అయితే చక్రం వెనుక భాగంలో ఉండటం వల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయనే కారణంతోనే తీసివేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఏపీ సీఎంవో మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో జగన్ వెనుక భాగం గుండ్రని చక్రం ఉండగా, బుధవారం నాటి సమావేశంలో షేర్ చేసిన ఫోటోల్లో మాత్రం అది కనబడలేదు.
ఎందుకు మార్చేశారు..
కాగా, ఏపీ రాజధాని చిహ్నంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ బౌద్ధ ధర్మచక్రాన్ని ఏర్పాటు చేయించారు. ఇన్నిరోజుల పాటు అలాగే ఉన్నా.. అకస్మాత్తుగా ఎందుకు మార్చేశారు..? అని టీడీపీ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ శ్రేణులు మాత్రం మంచిపని చేశారని కితాబిస్తున్నారు.