ఏపీలో రియల్ ఎస్టేట్ అంత దారుణంగా పడిపోయిందా?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jun 2020 12:01 PM ISTరాజకీయంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఒకపక్క.. పాలనాపరమైన నిర్ణయాల విషయంలో కోర్టు ఇస్తున్న తీర్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడో మరో కొత్త తలనొప్పి మొదలైంది. మాయదారి మహమ్మారి పుణ్యమా అని.. ఏపీ రియల్ ఎస్టేట్ లో ఎక్కడ లేనంత స్తబ్దత నెలకొంది. దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగం ఇబ్బందుల్లో ఉన్న వేళలో.. ఏపీలో ఆ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. దీంతో.. ప్రభుత్వ ఆదాయం తగ్గటమే కాదు.. ఈ ఏడాది అంచనాలకు ఏ మాత్రం సంబందం లేని రీతిలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటుననారు.
మహమ్మారి.. లాక్ డౌన్ తదనంతర పరిణామాలు మిగిలిన రంగాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ మీద ఎక్కువగా ఉంది. దీనికి రాజకీయ అంశాలు తోడు కావటంతో నిర్మాణ రంగం నెమ్మదించింది. దీనికి తోడు ఇసుక.. సిమెంటు ధరలు పెరిగిపోవటంతో ఖర్చు భారీగా పెరిగాయి. ఇవన్నీ నిర్మాణ రంగాన్ని దెబ్బ తీసేలా మారాయి. దీంతో.. రిజిస్ట్రేషన్ల శాఖకు రావాల్సిన ఆదాయం రాని పరిస్థితి.
మేలో ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.750 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వాస్తవంలో అది కేవలం రూ.184 కోట్లకు మాత్రమే పరిమితమైంది. అంటే.. అంచనాలో కేవలం పావు వంతు మాత్రమే ఆదాయం రావటంతో.. వార్షిక ఆదాయం విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందన్న అంచనా వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ల మీద ఆదాయం దాదాపు శూన్యమైన వేళ.. లాక్ డౌన్ తర్వాత రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు ఏమీ లేకపోవటంతో ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు.
గత ఏడాదితో పోలిస్తే.. ఏపీలోని నగరాలు.. ముఖ్య పట్టణాల్లో తగ్గిన రిజిస్ట్రేషన్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. విశాఖ విషయానికే వస్తే.. గత ఏడాది మేతో పోలిస్తే.. ఈ మేలో వచ్చిన ఆదాయం మూడో వంతే కావటం గమనార్హం. ఈ మేలో విశాఖ జిల్లాలోని రిజిస్ట్రేషన్ల కారణంగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.26 కోట్లు మాత్రమే.
ఇక.. గుంటూరు జిల్లా విషయానికి వస్తే.. గత ఏడాది మేతో పోలిస్తే.. ఈ ఏడాది అదేనెలలో వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏకంగా రూ.30 కోట్లు తక్కువగా ఉండటం గమనార్హం. ఇలా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5వేల కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలు వేసుకుంది ప్రభుత్వం. ఇప్పుడా లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి లేదు. దీంతో.. ప్రభుత్వ అంచనాలు తలకిందులు కావటం ఖాయమని చెబుతున్నారు.