ఏపీలో భారీగా పాజిటివ్ కేసులు.. కారణం ఇదేనా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2020 5:01 AM GMT
ఏపీలో భారీగా పాజిటివ్ కేసులు.. కారణం ఇదేనా?

నిన్న మొన్నటి వరకూ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీన్ రివర్సు అవుతోంది. మొన్నటివరకూ ఏపీకి మించి తెలంగాణలో దూసుకెళ్లిన కేసులు.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఏపీలో భారీ ఎత్తున నమోదవుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో కరోనా నియంత్రణ చర్యలు పెద్ద ఎత్తున చేపడుతున్నారని.. ఆ కారణంతోనే కేసుల నమోదు తక్కువగా ఉందన్న వాదన వినిపించింది.

దీనికి తోడు వెనుకా ముందు చూసుకోకుండా నిర్దారణ పరీక్షలు భారీ ఎత్తున నిర్వహించటం కూడా వైరస్ వ్యాపించిన ప్రాంతాల్ని వెంటనే గుర్తించి.. చర్యలు తీసుకోవటానికి అవకాశంగా మారిందని చెప్పేవారు. మరిన్ని చర్యలు తీసుకుంటున్న వేళలో రోజు తేడాతో పెరిగిన కేసులు.. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందన్న మాటలు ఇప్పుడు ఏపీ ప్రాంత ప్రజల్ని వణికేలా చేస్తున్నాయి. శనివారం విడుదలైన గణాంకాల ప్రకారం ఆ ఏపీలో పాజిటివ్ కేసులు 2500లకు పైనే. రోజు వ్యవధిలో అంటే ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏపీలో పాజిటివ్ కేసులు ఐదువేలకు పైనే. 24 గంటల వ్యవధిలో ఇంత భారీగా కేసులు నమోదు కావటం ఇప్పటివరకూ జరగలేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున నమోదు అవుతున్న కేసులు ఇప్పుడు ఆ జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా నమోదైన ఐదు వేల కేసుల్లో ఆ ఒక్క జిల్లాలోనే ఆరు వందలకు పైగా నమోదుకావటం చూస్తే.. తీవత్ర ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతుంది. దాదాపు నాలుగువేల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న హైదరాబాద్ మహానగరంలో వెయ్యి కేసులు నమోదైతే.. ఆగమాగమైన తెలుగోళ్లు.. తూర్పుగోదావరి జిల్లాలలో ఇంత భారీగా కేసులు నమోదు ఎందుకైనట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఆ ఒక్క జిల్లాలోనే కాదు.. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరిగిపోవటం ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటివరకూ బాగున్నట్లే కనిపించిన ఏపీలో ఇప్పుడిలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుందన్న విషయంలోకి వెళితే.. కాస్త వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. దాదాపు పది.. పన్నెండు రోజుల క్రితం హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావటం తెలిసిందే. దీంతో.. హడలిపోయిన లక్షలాది మంది హైదరాబాద్ వదిలేసి ఊళ్ల బాట పట్టారు. అలా బయలుదేరిన వారిలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారే కాదు.. ఏపీకి చెందినోళ్లు ఎక్కువే.

ఇలా హైదరాబాద్ లో అంటించుకున్న వైరస్.. ఊళ్లకు వచ్చిన పది.. పన్నెండు రోజులకు అంతకంతకూ వ్యాపించి ఇప్పుడిలాంటి పరిస్థితికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంతోనే హైదరాబాద్ మినహా రెండు తెలుగురాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంటే.. అందుకు భిన్నంగా హైదరాబాద్ లో మాత్రం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టటం గమనార్హం.

Next Story