ఏపీలో గర్భిణులకు అందే సాయ‌మెంత‌?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 July 2020 9:15 AM GMT
ఏపీలో గర్భిణులకు అందే సాయ‌మెంత‌?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్నది తర్వాత.. ఎప్పటికప్పుడు సరికొత్త సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేయటం ఇటీవల కాలంలో ఒక అలవాటుగా మారింది. ఒకవేళ.. ఇలాంటి వాటిని విమర్శించినా.. తప్పు పట్టినా.. పేద ప్రజలకు పెద్ద మనసుతో సాయం చేస్తుంటే.. తప్పుడు ఆలోచనలతో తప్పు పడతారా? అంటూ ఎదురుదాడి చేయటం.. దానికి ఒక సెక్షన్ ప్రజలు అండగా నిలుస్తున్న పరిస్థితి. గతంలో ఏదైనా విషయాన్ని తప్పు.. ఒప్పులన్న కొలమానం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అభిమానం వ్యక్తిగతమైంది.

నిజంగానే తప్పు చేసినా.. అలా తప్పు చేశారని ఎత్తి చూపటం కూడా తప్పే అన్నట్లుగా తెలుగు రాజకీయాలు మారిపోయాయి. దీంతో.. అరకొర సమాచారాన్ని ఆధారంగా చేసుకొని ఇంద్రుడు.. చంద్రుడు అంటూ పొగడటం అలవాటుగా మారింది. దీంతో.. వాస్తవాలు బయటకు రాని దుస్థితి. ఇదంతా ఎందుకంటే..? ఒక వార్త కొందరిని ఆకర్షిస్తోంది. అదేమంటే.. కేంద్రంలోని మోడీ సర్కారు దేశంలోని 650 జిల్లాల్లోని గర్భిణి మహిళలకు ప్రసవం జరిగిన తర్వాత తక్షణ సాయం కింద రూ.6వేలు అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మొత్తాన్ని నేరుగా కేంద్రమే.. సదరు గర్భిణి బ్యాంకు ఖాతాల్లో వేయనున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి తాజాగా ఒక కొత్త పథకాన్ని ప్రకటించారు. వైఎస్ ఆర్ ఆరోగ్య ఆసరా పేరుతో ప్రసవమైన మహిళలకు తక్షణ సాయం కింద రూ.5వేలు సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఏపీలోని గర్భిణి మహిళలకు అందే మొత్తం ఎంత? అన్నది ఇక్కడ ప్రశ్న. ఓ పక్క కేంద్రంలోని మోడీ సర్కారు రూ.6వేలు ఇస్తామని చెబుతున్నారు. మరోవైపు ఆసరా కింద సీఎం జగన్ రూ.5వేలు ఇస్తామంటున్నారు. అంటే.. ఏపీలోని గర్భణి మహిళలకు అందేది రూ.11వేలా? రూ.5వేలా? ఒకవేళ రూ.5వేలే అందేది అంటే మోడీ సర్కారు ఇచ్చే డబ్బుల్ని తగ్గించి ఇస్తున్నట్లు కదా? అలా కాదు.. కేంద్రం.. రాష్ట్రం కలుపుకొని రూ.11వేలు అంటే సీఎం జగన్ కంటే గ‌ట్స్ ఉన్న లీడ‌ర్ ఎవరుంటారు చెప్పండి? కాకుంటే.. ఈ సందేహాలకు సమాధానం ఇచ్చేవారెవరు? అన్నదే అసలు ప్రశ్న.

Next Story