'కమ్యునిస్టులూ'.. మీకు అర్ధమవుతుందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Jan 2020 12:55 PM ISTప్రస్తుత ఏపీ రాజకీయాలు సీఎం జగన్ వర్సెస్ - ఇతర పార్టీలుగా ఇప్పుడు మారిపోయాయి. పూర్వం వారి పెద్దలు రాసిన సిద్ధాంతాలు అడ్డు వస్తుండటంతో కమ్యునిస్టులు నేరుగా కొందరితో కలిసేందుకు మొహమాటపడుతున్నారేగానీ, రాజకీయ ముఖ చిత్రం మాత్రం స్పష్టంగానే ఉంది. ఏది ఏమైనా సరే జగన్‌ను దెబ్బ తీయాలన్నదే ఇప్పుడు అన్ని పార్టీల ఉమ్మడి జెండా. ఈ ఎజెండా అమలుకు సూత్రధారి పెద్దన్న చంద్రబాబే అన్నది అందరికి తెలిసిందే.
మొన్నటి ఎన్నికల ముందు వరకు మోడీని దించేస్తా, కమలాన్ని నలిపేస్తా అంటూ దేశం మొత్తం తిరిగిన చంద్రబాబు ఫలితాలు రాగానే సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. దేశానికి ఆ మూలాన ఉన్న మమతా బెనర్జీ, ఆ పక్కనే ఉన్న దేవేగౌడ ఏమనుకుంటారోనన్న మొహమాటం కూడా లేకుండానే అబ్బే మోడీతో తనకేమీ గొడవ లేదంటూ చంద్రబాబు నయారాగం అందుకున్నారు. బీజేపీ మెప్పు కోసం ఆత్మీయులైన సుజనాచౌదరి, సీఎం రమేష్‌తోపాటు మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులను బీజేపీకి దత్తతగా ఇచ్చేశారు చంద్రబాబు.
ఇప్పటికే పలుమార్లు తన చేతిలో మోసపోయిన బీజేపీ ఇంకోసారి తనను నమ్మి దగ్గరకు తీసుకోకపోతుందా..? అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే..? ఒకవైపు మోడీతో తనకేమీ గొడవ లేదని, బీజేపీతో పొత్తు వదులుకుని మొన్నటి ఎన్నికల్లో తప్పు చేశానంటూ చంద్రబాబు కమలనాదం ఊదుతున్నా కమ్యునిస్టులు నారాయణ, రామకృష్ణలు మాత్రం ఎంచక్కా చంద్రబాబు వెంట తిరుగుతున్నారు. మీ బాధ.. మా బాధ కాదా..? చంద్రబాబు అన్నట్టు రామకృష్ణ ఏకంగా చంద్రబాబుతో కలిసి అమరావతి ఉద్యమంలో జోలి పంచుకుంటున్నారు.
సీపీఐ నారాయణ ఏకంగా శుక్రవారం నారా లోకేష్ బైక్‌పై ఎక్కి అమరావతిలో విహరించారు. ఏదో తెలియని అతీత బంధం లేకుంటే ఇంత ఈజీగా వేర్వేరు పార్టీల నేతలు పదే పదే విడిపోయి కలవడమన్నది సాధ్యమా..? ఇప్పటికే చంద్రబాబు ఒకసారి కమ్యునిస్టులను, మరోసారి బీజేపీని వాడుకుంటూ ఎన్నికలకు వెళ్లిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. చంద్రబాబు తమను వాడి వదిలేస్తారని తెలిసినా, బీజేపీ నుంచి పిలుపు వస్తే కాషాయం స్వీకరిస్తారని తెలిసినా కమ్యునిస్టులు మాత్రం రక్త సంబంధీకులు మాదిరిగా చంద్రబాబు కోసం తపించడమే ఏపీ కమ్యునిజంలో ప్రత్యేకత.
ఒక వైపు బీజేపీకి పశ్చాత్తాప ప్రేమ లేఖలు పంపుతూనే కమ్యునిస్టులతో కలిసి జోళి పంచుకుంటున్న చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్‌ను కూడా తనదైన శైలిలో పట్టాలెక్కించాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీకి అనుకూలంగా జనసేన అభ్యర్థులను బరిలోకి దింపారు అన్నది జనసేన నుంచి బయటకు వచ్చిన నేతలే ఇప్పుడు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్‌రెడ్డిపైనే అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారేగానీ, నాడు అధికారంలో ఉన్న చంద్రబాబును మాత్రం సుతిమెత్తని విమర్శలతో తాకుతూ వచ్చారు.
ఏపీలో జగన్ మోహన్‌రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాదన్నది చంద్రబాబుకు, పవన్ కళ్యాన్‌కు ఆరు నెలల్లోనే తెలిసి వచ్చినట్టుగా ఉంది. అందుకే ఇద్దరూ ఇప్పుడు కొత్త అండకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సుజనా చౌదరి వెళ్లి బీజేపీ పెద్దలకు చంద్రబాబుపై కోపాన్ని తగ్గించే రసాలు నూరిపోస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన శక్తి మేర ఏపీలో జగన్ మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీకి నూరిపోస్తారు. చంద్రబాబు దారి తప్పినా బీజేపీ మిత్రుడిగా, బీజేపీ పెద్దల్నే వీరు నమ్మించవచ్చు.
ఇప్పటికే చంద్రబాబు అభిమానులతో నిండిపోయిన ఏపీ బీజేపీ సొంతంగా ఇక్కడ ఎదుగుతుందంటే అది భ్రమే అవుతుంది. 2024 వరకు ఇలాగే లాగి, తీరా ఎన్నికల సమయంలో తిరిగి సుజనా బృందం, పవన్ కళ్యాణ్ ప్రోద్బలం కలిసి చంద్రబాబును బీజేపీ పెద్దలు అక్కున చేర్చుకునే పరిస్థితిని తీసుకురావొచ్చు. అప్పుడు మళ్లీ 2014 తరహాలోనే బీజేపీ, పవన్ కళ్యాణ్‌లు భుజాలపై ఎక్కించుకుంటే చంద్రబాబు వారి భుజాలపై కూర్చొని గాల్లో కత్తులు తిప్పుతూ ఎన్నికలకు వెళ్లనున్నారన్న మాట.
ఎటొచ్చీ.. కమ్యునిస్టుల పరిస్థితే ఏమిటన్నది అగమ్య గోచరం. మొన్నటి ఎన్నికల వరకు ఎర్ర తువాలు వేసుకుని ఆధునిక చెగువేరా అంటూ నమ్మించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కాషాయంలో కలిసిపోయారు. ప్రస్తుతానికి కమ్యునిస్టులకు నమ్మదగ్గ తోడు లేదు. పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోయిన కమ్యునిస్టులు పాత పరిచయస్తులు చంద్రబాబుతోనే మరోసారి కలిసి అమరావతి ఉద్యమంలో జోళిభారం పంచుకుంటున్నారు. కానీ, చంద్రబాబు చూపు మాత్రం కమలంవైపే ఉంది. బీజేపీ నుంచి చంద్రబాబుకు ఒక్క పిలుపువస్తే కమ్యునిస్టులకు మళ్లీ ఖాళీజోళి ఖాయం.
ఏది ఏమైనా ఏపీలో సిద్ధాంతాలతో సంబంధాలు లేకుండా పూటకో వేషం కట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయంటే.. అది జగన్ మహత్యమేనని చెప్పాలి. ఒంటరిగా జగన్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదన్న నిర్ధారణకు వచ్చిన తరువాతే విపక్షాలన్నీ సిద్ధాంతాలతో సంబంధాలు లేకుండా కొత్త కాపురాల కోసం వెంపర్లాడుతున్నాయి. బీజేపీ స్నేహంతో రాజకీయం మొదలుపెట్టి .. పెద్ద కమ్యునిస్టుగా మధ్యలో ఫోజుకొట్టి.. తిరిగి కాషాయంలో కలిసిపోయిన పవన్ కళ్యాణ్‌కంటే.. చంద్రబాబు వాడి వదిలేస్తారని తెలిసి కూడా తిరిగి ఆయన జోళి మోసేందుకు సిద్ధమైన కమ్యునిస్టులకంటే.. ఈ కాలానికి ఏపీలో కేఏ. పాల్ రాజకీయమే కాస్త నయమనిపిస్తుంది.