మండలికి అంతమంది మంత్రులు ఎందుకంటే?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jun 2020 6:53 AM GMT
మండలికి అంతమంది మంత్రులు ఎందుకంటే?

ఏపీ అసెంబ్లీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉందన్న విషయం తెలిసిందే. ఆసక్తికరంగా ఏపీ మండలిలో విపక్ష తెలుగుదేశానికి అంతేస్థాయిలో బలముంది. అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది సభ్యులు ఉంటే.. విపక్ష టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్నారు. జనసేనకు ఒకరున్నారు. అధికారిక లెక్కలు ఇలా ఉంటే.. పార్టీలు మారిన సభ్యుల లెక్కల్నిపరిగణలోకి తీసుకుంటే.. అధికారపక్షానికి మరింత బలముందని చెప్పాలి. ఏపీ అసెంబ్లీలో ఇంత బలమున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ శాసన మండలిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి.

ఏపీ శాసన మండలిలో మొత్తం 58 మంది ఎమ్మెల్సీలు ఉండగా.. టీడీపీకి 34 మంది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. పీడీఎఫ్ కు ఆరుగురు.. స్వతంత్రులు ముగ్గురు.. బీజేపీకి ఇద్దరు.. కాంగ్రెస్ కు ఒకరు ఉండగా.. మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. ఈ గణాంకాల్ని చూస్తే.. మండలిలో విపక్ష టీడీపీకి తిరుగులేని అధిక్యత ఉంది. వారి బలాన్ని అడ్డుకోవటం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకు ఒక పట్టాన సాధ్యం కాని పరిస్థితి.

ఈ కారణంతోనే.. ఆ మధ్యన మండలిని రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మండలిలో తమకు బలం తక్కువగా ఉన్న వేళ.. ఆ లోటును భర్తీ చేసేందుకు పలువురు మంత్రులు మండలికి హాజరవుతూ ఉంటారు. మండలి సమావేశాలకు మంత్రులు రావటం సాధారణ విషయమే అయినా.. ఏపీ మండలిలో చూస్తున్నట్లుగా పెద్ద ఎత్తున రావటం చాలా తక్కువ.

బుధవారం విసయానికే వస్తే.. ఏపీ మండలి సమావేశానికి హాజరైన మంత్రుల సంఖ్యే దీనికి నిదర్శనంగా చెప్పాలి. విపక్ష వ్యూహాలకు చెక్ పెట్టేందుకు వీలుగా అధికారపక్షానికి చెందిన పలువురు మంత్రులు మండలికి హాజరయ్యారు. వారిలో మంత్రి మోపిదేవి వెంకటరమణ.. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి.. మంత్రులు బొత్స సత్యనారాయణ.. పినిపె విశ్వరూప్.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. బాలినేని శ్రీనివాసరెడ్డి.. అవంతి శ్రీనివాసరావు.. ఆదిమూలపు సురేశ్.. కురసాల కన్నబాబు.. అనిల్ కుమార్ లు వచ్చారు.

దగ్గర దగ్గర పది మంది వరకు వచ్చినట్లు. అంటే.. తమకున్న తొమ్మిది మంది సభ్యులకు పది మంది మంత్రులు కలిస్తే.. వారి బలం మండలిలో పందొమ్మిదిగా మారుతుందని చెప్పాలి. టీడీపీకి ఉన్న 34 మంది ఎమ్మెల్సీల ముందు ఇది తక్కువే. తమకున్న అధిక్యతతో అధికారపక్షాన్ని అడ్డుకోవాలన్న విపక్ష టీడీపీకి చెక్ పెట్టేందుకు వీలుగా ఇంత మంది మంత్రులు మండలిలో మొహరించారన్న మాట వినిపిస్తోంది. ఏమైనా మండలి సమావేశాలకు ఇంత భారీ సంఖ్యలో మంత్రులు హాజరుకావటం చాలా తక్కువన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Next Story