ఏపీ పెద్దల సభలో బుధవారం ఏమైంది.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Jun 2020 6:13 AM GMT
ఏపీ పెద్దల సభలో బుధవారం ఏమైంది.?

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండు రోజుల పాటు సాగిన ఏపీ శాసన మండలిలో బుధవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరూ తిట్టుకోవటం.. స్థాయి దాటి బూతల వరకూ వెళ్లటం మాత్రమే జరిగిన దానికి భిన్నంగా... సభ్యులు కొట్టుకునే వరకూ వెళ్లటం సంచలనంగా మారింది. ఇంతకీ అంతవరకూ ఎందుకు వెళ్లింది? సభలో అసలేం జరిగింది? గొడవకు మూలం ఏమిటి? అన్న ప్రశ్నలకు సాపేక్షంగా సమాధానాలు వెతికితే..

మండలిలో బుధవారం కీలక బిల్లుల్ని ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దీనికి కారణం.. అధికారపక్షానికి బలం లేకపోవటం.. విపక్షానికి పూర్తిస్థాయిలో బలం ఉండటమే. ఈ కారణంతోనే పది మంది వరకూ మంత్రులు మండలికి హాజరయ్యారు. అధికార.. ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలకు రంగం సిద్ధం చేసుకున్నాయి. మండలి ప్రారంభమయ్యాక విద్య.. దేవదాయ.. ఎక్సైజ్.. రెవెన్యూ.. మున్సిపల్.. పంచాయితీరాజ్ శాఖలకు చెందిన బిల్లులు ఆమోదం పొందాయి. ఇక్కటివరకూ పరిస్థితి బాగానే ఉంది.

ఎప్పుడైతే కీలకమైన బిల్లులు.. మూడు రాజధానులు.. రాజధాని నగర ప్రాంత అభివృద్ధి సంస్థ బిల్లులు.. ద్రవ్య వినిమయ బిల్లుల ప్రస్తావన వచ్చింది. ఇక్కడే మండలిలో మాటల మంటలు మొదలు కావటమే కాదు.. అదుపు తప్పటం షురూ అయ్యింది. బ్యాలెన్సు ఉన్న బిల్లుల్లో ద్రవ్య వినిమయ బిల్లును ముందుగా ప్రవేశ పెట్టాలని మండలిలో ప్రతిపక్ష నేత యనమల కోరారు. అయితే.. ఆయన చేసిన ప్రతిపాదనకు ఒకదశలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓకే చెప్పేందుకు సిద్ధమవుతుండగా.. మునిసిపల్ మంత్రి బొత్స వారించారు.

ఇతర బిల్లుల్ని ఆమోదించిన తర్వాతే ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించి.. సభను వాయిదా వేయటం సంప్రదాయంగా వస్తుందన్న పాయింట్ ను తెర మీదకు తీసుకొచ్చారు. అదేం లేదు.. ముందు ద్రవ్య వినిమయ బిల్లునే ఆమోదించాలని టీడీపీ డిమాండ్ చేసింది. దీనిపై వాద ప్రతివాదనలు చోటు చేసుకున్నాయి. సభ అదుపు తప్పుతుందని భావించిన డిప్యూటీ ఛైర్మన్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. తర్వాత కూడా పరిస్థితి మారలేదు.

యనమల ఆదేశాల్ని పాటించటానికి ఇదేమీ టీడీపీ ఆఫీసు కాదని మంత్రులు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా అధికార.. విపక్ష సభ్యుల మధ్య వాద ప్రతివాదనలు జరిగాయి. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. రూల్ 90ను పరిగణలోకి తీసుకోవాలని చెప్పగా.. ఈ నోటీసును ఒక రోజు ముందుగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.

దీంతో.. తొలుత బడ్జెట్ ను ఆమోదించాలా? ఇతర బిల్లులను ఆమోదించాలా? అన్న విషయంపై ఎడతెగని రీతిలో అధికార.. విపక్షాల మధ్య వాదనలు జరుగుతుండగా.. అధికారపక్ష నేతలు.. డిప్యూటీ ఛైర్మన్ తీరును తప్పు పట్టారు. సభను కంట్రోల్ చేయకపోవటాన్ని ప్రస్తావించారు. దీనిపై ఆయన ఘాటుగా రియాక్టు అయ్యారు. ఇదిలా ఉంటే.. యనమల వర్సెస్ పిల్లి సుభాశ్ ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

ఇదో పక్క సాగుతుంటే..మరోవైపు మంత్రి అనిల్ కుమార్ వర్సెస్ బాబు రాజేంద్రప్రసాద్ ల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత? అన్న రీతిలో మాటల యుద్ధం సాగుతోంది. ఇలాంటివేళ.. రాజేంద్రప్రసాద్ ఆగ్రహంతో జగన్ ఏడాది పాలనపై రఘురామను.. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిలను అడిగితే చెబుతారనటంతో మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. మాటల తీవ్రత మోతాదు దాటటం.. మంత్రి అనిల్ నోటి నుంచి ఏరా అన్న మాట రావటంతో పరిస్థితి మరింతగా దిగజారింది. ఇది జరిగిన కాసేపటికే సభ్యులు కొట్టుకోవటం చోటు చేసుకుంది.

Next Story