దేశ చరిత్రలోనే తొలిసారి ఏపీ మండలిలో అలా జరిగిందట.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2020 9:40 AM GMT
దేశ చరిత్రలోనే తొలిసారి ఏపీ మండలిలో అలా జరిగిందట.!

ఏపీ శాసనమండలిలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేశ చరిత్రలో ఇప్పటివరకూ మరే రాష్ట్రంలో చోటు చేసుకోని సిత్రం ఏపీలో చోటు చేసుకుందని చెబుతున్నారు. సాధరాణంగా అసెంబ్లీలో కానీ.. మండలిలో కానీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లులకు.. బడ్జెట్ కు సవరణలు ప్రతిపాదించటం ప్రతిపక్షాలు చేస్తుంటాయి. ఇది తరచూ చోటు చేసుకునే పరిణామం. అందుకు భిన్నంగా మండలిలో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం మాత్రం దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలో జరగలేదంటున్నారు.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీ అసెంబ్లీలో గవర్నర్ తన ప్రసంగాన్ని ఆన్ లైన్ ద్వారా వినిపించారు. అనంతరం గవర్నర్ తీర్మానంపై చర్చ జరిగిన తర్వాత.. అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం సాధారణ బడ్జెట్.. వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశానికి వచ్చేసరికి మండలిలో విపక్షం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది.

గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాల్ని తొలగించాలని.. మరికొన్నింటిపైనా తన అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. ఊహించని రీతిలో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణల్ని ఆమోదిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీలో జగన్ ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఉంటే.. మండలిలో మాత్రం విపక్షం తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది.

ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలోని కొన్ని అంశాలపై విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవానికి గవర్నర్ ప్రసంగానికి సవరణలు ప్రతిపాదించటమే ఒక వింతగా పలువురు అభివర్ణిస్తున్నారు. అలా చేసిన తర్వాత.. వాటిని ఆమోదిస్తూ ఇప్పటివరకూ ఏ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. గవర్నర్ ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం కావటంతో సవరణలకు విలువ ఉండదు. మొత్తంగా చూస్తే.. తమకున్న బలంతో టీడీపీ ఎమ్మెల్సీలు జగన్ సర్కారుకు షాకిచ్చారనే మాట పలువురి నోట వినిపిస్తోంది.

Next Story