శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి అనుమతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2020 10:02 AM GMT
శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనానికి అనుమతి

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతించని విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా జూన్ 8 నుంచి ఆలయాల్లో దర్శనాలు ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ మేరకు అనుమతి ఇవ్వాలని టీడీడీ జేఈవో ధర్మారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ట్రయల్ పద్ధతిలో దర్శనాలు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది.

ఆరు అడుగుల భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనం చేసుకోవాలని సూచించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, మార్గదర్శకాలు వెల్లడికానున్నాయి. అయితే ప్రస్తుతం భక్తలకు అనుమతించకుండా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు, స్థానికులతో ప్రయోగాత్మకంగా దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ వారం రోజులు ఇలా నిర్వహించాక తగు జాగ్రత్తలతో ఈ నెల 8 నుంచి సాధారణ, వీఐపీ దర్శనాలకు అనుమతి ఇచ్చే అవకాశముంది.

Next Story
Share it