ఇక నుంచి సగం ధరకే తిరుమల లడ్డు

By సుభాష్  Published on  23 May 2020 8:43 AM GMT
ఇక నుంచి సగం ధరకే తిరుమల లడ్డు

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత రెండు నెలలకుపైగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాలను నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో భక్తుల కోరిక మేరకు రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లోని కళ్యాణ మండపాల్లో లడ్డు ప్రసాదం 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని టీటీడీ తెలిపింది. లాభనష్టాలను పక్కనపెట్టేసి భక్తులకు స్వామివారి ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీఈ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో 15 నుంచి 20వేల లడ్డూలను భక్తులకు మొదటి దశలో అందించనున్నట్లు తెలిపారు.

ఈ లడ్డు ధర రూ. 50 ఉండగా, రూ. 25కే సగం ధరకు అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, కృష్ణ, వెస్ట్‌ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలకు రెండు ట్రక్కుల్లో లడ్డూలను పంపించామని తెలిపారు. కరోనా వైరస్‌ కారణంగా శ్రీవారి లడ్డు అందరికి అందేలా సంగం ధరనే నిర్ణయించామని అన్నారు. స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించే వరకూ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇక ఈ-హుండి ద్వారా స్వామివారికి వస్తున్న ఆదాయం పెరిగిందని తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్‌ లో 1.79 కోట్లు రాగా, ఈ సంవత్సరం రూ. 1.97 కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చినట్లు తెలిపారు. ఆలయ నిర్వాహకులకు, ఉద్యోగుల వేతనాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, స్వామివారి అనుగ్రహంతోనే భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి రాబోదన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు.

Next Story
Share it