ఏపీలో ఇళ్లపట్టాల పంపిణీ మళ్లీ వాయిదా
By తోట వంశీ కుమార్ Published on 12 Aug 2020 5:46 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరో సారి వాయిదా పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15న నిర్వహించాలనుకున్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగడం లేదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మళ్లీ పంపిణీ ఎప్పుడు అనేది త్వరలోనే చెబుతామన్నారు. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడం వల్ల ఇళ్లపట్టాల పంపిణీ కార్మక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూములను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. తొలుత ఉగాది రోజున (మార్చి 25న) లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని భావించారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న కారణంగా సాధ్యం కాలేదు. ఆ తరువాత జూన్‌లో ఈ కార్యక్రమం చేపట్టాలని అనుకున్నా.. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల అది సాధ్యం కాలేదు. జూలై 8న దివంగత వైఎస్‌ఆర్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని అనుకున్నారు.. అయితే.. హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15కి వాయిదా వేసింది ప్రభుత్వం.