భారీ ఎత్తున హామీలు ఇవ్వటం రాజకీయ అధినేతలకు అలవాటే. అలాంటి హామీల్ని తాను అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే 80 శాతానికి పైగా అమలు చేసిన ఏపీ సీఎం జగన్.. ఒక హామీని అమలు చేసే విషయంలో మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న వైనం కనిపిస్తుంది. ఇంతకూ ఆ హామీ ఏమిటన్న వివరాల్లోకి వెళితే..

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసే సమయంలోనూ.. ఆ తర్వాత ఆయన తన నవరత్నాల కార్యక్రమం గురించి గొప్పగా చెప్పుకోవటమే కాదు.. సీఎంవో ఆఫీసులో.. సదరు నవర్నతాలకు సంబంధించి వేర్వేరు ఫ్లెక్సీల తరహాలో గోడలకు తగిలించిన వైనం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నిలకు ముందు తానిచ్చిన హామీల అమలు గురించి తనను కార్యోన్ముఖుడ్ని చేసేందుకు ఈ విధానం పనికి వస్తుందని జగన్ భావించేవారు. అదే విషయాన్ని ఆయన చెప్పటాన్ని మర్చిపోలేం.

ఇదిలా ఉంటే.. తాను అమలు చేస్తానని చెప్పిన నవరత్నాల్లో కీలకమైనది పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం. వాస్తవానికి ఈ పథకాన్ని భారీగా అమలు చేస్తామని.. పెద్ద ఎత్తున ప్రకటన వెలువడినా.. ఆచరణలో మాత్రం లేకపోవటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఈ మధ్యన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని జగన్ నిర్ణయించినట్లుగా చెప్పి.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం షురూ చేశారు.

ఏమైందో కానీ.. ఉన్నట్లుండి జోరుగా సాగాల్సిన కార్యక్రమాన్ని చప్పున బ్రేకులు వేయటమే కాదు.. మరో నెలకు పైనే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకిలా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. పేదలకు ఇళ్ల స్థలాల పంపినీని అడ్డుకుంటూ సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తోంది. ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఏం చెబుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

తీరా పథకాన్ని అమలు చేయటం షురూ అయ్యాక.. సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ప్రభుత్వ ఇమేజ్ దెబ్బ తినటమే కాదు.. ఇచ్చిన హామీని అమలు చేసే విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కనిపించక మానదు. దాదాపు 25 లక్షల మంది పేదలకు ప్రయోజనం కలిగే ఈ కార్యక్రమం విషయంలో ఏ మాత్రం తేడా జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఆచితూచి అన్నట్లు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలస్యమవుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఈ పథకం అమలు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *