క‌రోనా చికిత్స‌లో ఏపీ ప్ర‌భుత్వం స‌రికొత్త నిర్ణ‌యం.. వారికి ఇంటి వ‌ద్ద‌నే చికిత్స‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 May 2020 9:56 AM IST
క‌రోనా చికిత్స‌లో ఏపీ ప్ర‌భుత్వం స‌రికొత్త నిర్ణ‌యం.. వారికి ఇంటి వ‌ద్ద‌నే చికిత్స‌

ఏపీలో క‌రోనా విజృంభిస్తుంది. ఈ మ‌హ‌మ్మారిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తుంది. అందులో బాగంగానే ప్ర‌భుత్వం క‌రోనా చికిత్స అందించ‌డంలో స‌రికొత్త నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. కరోనా లక్షణాలు ఉన్న‌ 50ఏళ్ల లోపు వారికి ఇంట్లోనే చికిత్స అందించే విధంగా యోచిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు వైద్య ఆరోగ్యశాఖ పలు నిబంధనలతో మార్గదర్శకాలు రూపొందించిన‌ట్లు తెలుస్తుంది.

ఆరోగ్య శాఖ నిర్వహించే పరీక్షల్లో లక్షణాలు ఉన్నవారు ఆరోగ్యాంగా ఉండాలి. అయితే.. వారికి మాత్రం వైద్యుని సిపారసుతోనే మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు కోవిడ్ ఆసుపత్రికి సమీపంలో ఉండాలి. అలాగే.. ఇంట్లో ప్రత్యేక గది, బాత్‌రూమ్ లాంటి వసతులు ఉండాలి. ఇక ఎవ‌రితో సంబంధాలు కొసాగించ‌కుండా 14 రోజుల స్వీయ‌ నిర్బంధంలో ఉండాలి. ఇలా కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించిన‌ట్లు తెలుస్తుంది.

ఇదిలావుంటే.. ఏపీలో న‌మోద‌యిన‌ 75శాతం కేసుల్లో కరోనా లక్షణాలు క‌నిపించ‌క పోవ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. గురువారం నాటికి న‌మోద‌యిన‌ మొత్తం కేసులు 1403లో.. 1050 కేసులు ల‌క్ష‌ణాలు క‌నిపించ‌ని కేసులు. వీరి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉంది. వీరంతా 60 ఏళ్ల లోపు వారే. మొత్తం కేసుల‌లో 20-40ఏళ్ల లోపువారు 44-45 శాతం ఉన్నట్లు అంచనా. దీంతో వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా.. భౌతిక దూరం పాటించడమే పరిష్కారం అని ప్ర‌భుత్వం ఓ నిర్దారణకు వ‌చ్చింది.

ఇక‌.. ఏపీలో కరోనా టెస్టులు లక్షకు చేరువలో ఉన్నాయి. అయితే.. గ‌డిచిన‌ 10 రోజుల్లో కేసులు రెట్టింపు అయ్యాయి. కర్నూల్, గుంటూరు, కృష్ణా జిల్లాల‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. గురువారం నాటికి మొత్తం కేసులు 1403కు చేర‌గా.. జిల్లాల వారిగా.. కర్నూలు 386, గుంటూరు 287, కృష్ణా 246, నెల్లూరు 84, చిత్తూరు 80, కడప 73, అనంతపురం 61, ప్రకాశం 60, ప‌శ్చిమ గోదావ‌రి 56, తూర్పు గోదావ‌రి 42, విశాఖప‌ట్నం 23, శ్రీకాకుళం 5 కేసులు నమోదయ్యాయి.

Next Story