స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్‌..!

By అంజి  Published on  7 Dec 2019 5:41 AM GMT
స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం కీలక పోస్టింగ్‌..!

అమరావతి: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వం కీలక పోస్టింగ్‌ను ఇచ్చింది. పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణా కాలం పూర్తి చేసుకున్నారు. ఈ నేఫథ్యంలో ఆమెను హైదరాబాద్‌ లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌ ఓఎస్‌డీగా నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌లో ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టును ప్రభుత్వం ఓస్‌డీగా అప్‌గ్రేడ్‌ చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలను పంపాలని ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ప్రకటించింది. 2018 డిసెంబర్‌ 7 నుంచి 2020 ఆగస్టు 30 వరకు పీవీ సింధుకు ఆన్‌ డ్యూటీ సౌకర్యం కల్పించారు. కాగా ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

సెప్టెంబర్‌ నెలలో సీఎం వైఎస్‌ జగన్‌ను పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిశారు. టోక్యో ఒలంపిక్స్‌కు సిద్ధమవుతున్నానని పీవీ సింధుకు సీఎం జగన్‌కు తెలియజేశారు. సింధు మరోసారి పతకం సాధించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. సింధుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల సాయం చేస్తామని పేర్కొన్నారు. విశాఖ పట్నంలో బ్యాడ్మింటన్‌ ఏర్పాటుకు ఐదెకరాల స్థలం కేటాయిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

టోక్యో ఒలింపిక్స్‌ ప్రాక్టీసు సమయంలో.. ఆన్‌ డ్యూటీగా గుర్తించాలని సీఎం జగన్‌ను పీవీ సింధు కోరారు. ఈ విజ్ఞప్తికి ఏపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 2020 ఆగస్టు 30 వరకు ఆన్‌ డ్యూటీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఇటీవల సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Next Story
Share it