సుప్రీంకోర్టు జడ్జిపై ఎపీ ప్ర‌భుత్వం ఫిర్యాదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 6:14 AM GMT
సుప్రీంకోర్టు జడ్జిపై ఎపీ ప్ర‌భుత్వం ఫిర్యాదు

ఎపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్‌వీ రమణపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేసింది. ఈ విష‌య‌మై ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం దీనికి సంబందించిన వివరాలను శ‌నివారం రాత్రి మీడియాకు వెల్లడించారు.

ప్రజా ప్రయోజనం దృష్ట్యా కొన్ని ఛానళ్లలో వస్తున్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడించాలని నిర్ణయించుకున్నామని అజయ్ కల్లం అన్నారు. అమరావతి భూకుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జి జస్టిస్‌ సోమయాజులు స్టే ఇచ్చారని తెలిపారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ కేసులోనూ రాష్ట్ర హైకోర్టు అసలు ప్రచారమే చేయవద్దని ఏకంగా గాగ్‌ ఆర్డర్‌ ఇచ్చిందన్నారు.

అలాగే.. ఈ ఏడాది జనవరిలో అధికార వికేంద్రీకరణ బిల్లులను.. ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఆ వెంటనే ఏకంగా ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలయ్యాయన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరీని సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారు. చంద్రబాబు కోరుకున్నట్టుగా.. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ జోక్యం తర్వాత హైకోర్టులో పరిణామాలు మారిపోయాయని పేర్కొన్నారు.

ఈ కేసుల్లో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ రమణ జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు ఫిర్యాదు చేశామ‌ని.. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అక్టోబర్‌ 8న అందించినట్లు అజయ్ కల్లం వెల్లడించారు.

నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర హైకోర్టు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత‌ చంద్రబాబు నాయుడుకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు జరుగుతున్నాయని ఎపీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయాలను ఎపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్‌కు పిర్యాదు చేసింద‌ని అజయ్ కల్లం తెలిపారు.

Next Story
Share it