రాష్ట్రంలో ప్రతి కటుంబానికి క‌రోనా ప‌రీక్ష‌లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jun 2020 10:13 AM IST
రాష్ట్రంలో ప్రతి కటుంబానికి క‌రోనా ప‌రీక్ష‌లు

అమరావతి : కోవిడ్‌ నివారణ తదుపరి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పటిష్టమైన క్షేత్రస్థాయి వ్యూహాన్ని అమలు చేయనుంది. వచ్చే 90 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో స్క్రీనింగ్‌ చేయాలని, పరీక్షలు నిర్వహించాలని సీఎం వైఎస్‌. జగన్‌ అధికారులను ఆదేశించారు. దీని కోసం 104 వాహనాలను వినియోగించుకోవాలని, అనుమానం ఉన్న వారి నుంచి కోవిడ్‌ శాంపిల్‌ తీసుకునే సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి, వారికి అక్కడే మందులు కూడా ఇవ్వాలన్నారు.

దీనికి అనుగుణంగా 104లో సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి నెలలో కనీసం ఒకసారి గ్రామంలో 104 ద్వారా వైద్యసేవలు, స్క్రీనింగ్‌ జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. స్క్రీనింగ్, పరీక్షలు చేసిన తర్వాత వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఆరోగ్య కార్డులో పొందుపర్చాలన్నారు. పట్టణాలకు సంబంధించి కూడా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి, నివారణా చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశానికి డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కెఎస్‌ జవహర్‌రెడ్డి త‌దిత‌రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో బలమైన వ్యవస్థల ద్వారానే కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకోగలమని సీఎం స్పష్టం చేశారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడం ద్వారా దీన్ని అడ్డుకోగలమన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని స్క్రీనింగ్‌ చేయడమే లక్ష్యంగా రానున్న 90 రోజుల్లో పని చేయాలన్నారు.

Next Story