అంతర్వేదిలో నూతన ర‌థం నిర్మాణ పనులు ప్రారంభం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2020 9:38 AM GMT
అంతర్వేదిలో నూతన ర‌థం నిర్మాణ పనులు ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి నూతన రథం నిర్మాణం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మేర‌కు‌ నూతన రథం నిర్మాణ పనులు శ‌నివారం ప్రారంభమ‌య్యాయి. వచ్చే స్వామి వారి కల్యాణోత్సవంకు నూతన రథంపై స్వామి వారి ఊరేగింపు జరగాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించడంతో.. రథం నిర్మాణం పనులను అధికారులు శరవేగంగా ప్రారంభించారు.

రథం నిర్మాణ కమిటీ ఇన్‌చార్జి కె. రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో.. శాస్త్రోక్తంగా పూజలు జ‌రిపి నూతన రథం నిర్మాణానికై కలప కోత పనులను ప్రారంభించారు. ఇదిలావుంటే.. నూతన రథం నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం 95 లక్షల రూపాయిలు కేటాయించి.. నూతన రథం నమూనాకు ఆమోదం తెలపడంతో నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు.

ఇదిలావుంటే.. కొద్దిరోజుల క్రితం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహాస్వామి కల్యాణమహోత్సవ రథం దగ్ధం అయ్యింది. ఈ విష‌య‌మై తీవ్ర రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు చెల‌రేగిన నేఫ‌థ్యంలో.. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవ‌రైనా కావాల‌నే చేశారా అనే కోణాల‌పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేర‌కు కేసును సీబీఐకి బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

అలాగే.. నూత‌న‌ రథం నిర్మాణంపై చర్చించిన దేవాదాయ శాఖ‌.. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా రూపొందించనున్నారు. కొత్త రథం నిర్మాణంతో పాటు.. ర‌థ‌శాల మరమ్మతులు నిమిత్తం ప్రభుత్వం రూ. 95 లక్షలు కూడా కేటాయించింది.

Next Story
Share it