ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు మంగళవారం సీఎం జగన్ పేర్లను ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స, సజ్జల మీడియాకు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు బొత్స వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని తెలిపారు. ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైఎస్సార్‌సీపీది ఒకేటే దారి అని, జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామని సజ్జల అన్నారు. గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధిని వైసీపీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోందని సజ్జల తెలిపారు.