ధీటుగా ప్రెస్ మీట్ పెట్టిన వైసీపీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు ఖండించారు.
By - Medi Samrat |
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీలు ఖండించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, సీబీఐ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారంటూ వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపి, అందులో నిజం లేదని తేల్చిందని వైసీపీ నేతలు తెలిపారు. ఆ తర్వాత సీబీఐ కూడా అదే నిర్ధారణకు వచ్చిందని పేర్కొన్నారు.
టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తనపై చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, ఎలాంటి పరీక్షకైనా తాను సిద్ధమని సవాల్ విసిరారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే పనులు చేయలేదని, స్వామివారి సాక్షిగా ఏ ప్రమాణం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని వైవీ రెడ్డి స్పష్టం చేశారు. నెయ్యి సరఫరాను పెంచేందుకే నిబంధనలు సవరించామని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదని వివరించారు. వివాదాస్పదమైన 'బోలె బాబా' కంపెనీ సరఫరా నిబంధనల సవరణకు ముందే జరిగిందని, అది కూడా టీడీపీ హయాంలోనే మొదలైందని గుర్తుచేశారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటున్నారని, ఇది ఘోరమైన తప్పని మిథున్ రెడ్డి విమర్శించారు.