కొడాలి నాని అటాక్ మొదలైంది..!
YSRCP Mla Kodali Nani Fire on Chandrababu. ఏపీలో రాజకీయ సమీకరణలు ఎంతో వేగంగా మారుతూ ఉన్నాయి.
By Medi Samrat Published on 12 Jun 2023 1:08 PM GMTఏపీలో రాజకీయ సమీకరణలు ఎంతో వేగంగా మారుతూ ఉన్నాయి. ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ నాలుగేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప మరేమీ లేదని అమిత్ షా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం, యూపీఏ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు. కేంద్రం నిధులు ఇస్తుంటే.. జగన్ తన ఫొటో పెట్టుకొని ప్రజలను మభ్యపెడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. రేషన్ బియ్యం మోదీ ఇస్తుంటే.. జగన్ తన ఫొటో వేసుకుంటున్నారని అన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని జగన్ చెప్పుకుంటున్నారు కానీ.. రైతుల ఆత్మహత్యల విషయంలో జగన్ సిగ్గుపడాలన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఆచితూచి స్పందిస్తూ ఉన్నారు. తాజాగా కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. హరికృష్ణని, ఎన్‌టిఆర్ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని, అమిత్ షా కాళ్లు బాబు పట్టుకున్నారని కానీ ఫొటోను బయటపెట్టలేదని అన్నారు. బీజేపీని, మోడీ, అమిత్ షాను తిట్టి సిగ్గులేకుండా చంద్రబాబు వాళ్ల కాళ్లు పట్టుకున్నారని అన్నారు. టిడిపి నేత లోకేష్‌పై కోడిగుండ్లు వెయ్యాల్సిన అవసరం తమకు లేదన్నారు. లోకేష్ కంటే తమ పార్టీలో ఎవరు పాదయాత్ర చేసినా అంతకంటే ఎక్కువ జనం వస్తారని నాని అన్నారు. చంద్రబాబు అధికారంలో లేకపోతే హెరిటేజ్, ఈనాడు, మార్గదర్శి, ఆంధ్రజ్యోతి, టివి5కి నష్టాలు వస్తాయని, వాళ్ల వ్యాపారాలు, అవినీతి కోసమే చంద్రబాబుకు అధికారం కావాలంటున్నారని నాని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రోడెక్కితే ఏం అవుతుందని, ఇంతకు ముందు ఎక్కలేదా? అని అడిగారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పదవి నుంచి దించేసి శతజయంతి ఉత్సవాలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్ముతారని కొడాలి నాని ప్రశ్నించారు. భారత రత్న ఇచ్చేంత గొప్ప వ్యక్తి ఎన్‌టిఆర్.. సీఎం పదవికి పనికిరాడా? ఎందుకు దించేశారని అడిగారు. చంద్రబాబు నాయుడుకు దూరంగా ఉండమని జూనియర్ ఎన్‌టిఆర్‌కు హరికృష్ణ చెప్పి ఉండొచ్చన్నారు.