జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు. కర్నూలు పాతబస్తీలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ.. రెండు నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోయిన పవన్ కల్యాణ్ కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు.
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే పవన్ కల్యాణ్ రాయలసీమలో పర్యటిస్తున్నారని, దమ్ముంటే కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. కర్నూలు నుంచి పవన్‌ను ఓడించేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ యాత్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో 95 శాతానికి పైగా అమలు చేశారని, అందులో అత్యధిక శాతం బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు మేలు జరిగేలా చేశారన్నారు. పవన్ కళ్యాణ్ ఒకవైపు బీజేపీతో, మరోవైపు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనల్లో టీడీపీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివి చంద్రబాబు మెప్పు పొందుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.