చంద్రబాబు ట్రాప్ లో బీజేపీ

YSRCP Leaders Fire On BJP. నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి తప్ప మరేం లేదంటూ విశాఖ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన

By Medi Samrat  Published on  12 Jun 2023 10:16 AM GMT
చంద్రబాబు ట్రాప్ లో బీజేపీ

నాలుగేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి తప్ప మరేం లేదంటూ విశాఖ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారిగా వైసీపీపై బీజేపీ పెద్దలు విమర్శలకు దిగడం.. ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీపై అమిత్ షా, జేపీ నడ్డాలు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా విమర్శలకు దిగుతున్నారు

బీజేపీపై వైసీపీ సీనియర్ నేత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శలు గుప్పించారు. తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఏపీకి బీజేపీ ఏం చేసిందో ముందు చెప్పాలని.. ఏపీకి ఏం చేశారో చెప్పిన తర్వాతే బీజేపీ ఉత్సవాలు జరుపుకుంటే బాగుంటుందని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిలో బీజేపీ భాగస్వామ్యం ఉందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏపీలో 20 పార్లమెంటు సీట్లు కావాలని అమిత్ షా అడుగుతున్నారని అన్నారు. బీజేపీ హైకమాండ్ చంద్రబాబు ట్రాప్ లో పడిపోయిందని.. పసుపు కండువాను మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వారి మాటలను అమిత్ షా నమ్ముతున్నారని అన్నారు.

మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండ్రోజుల నుంచి అమిత్ షా, నడ్డాలు ఏపీలో మీటింగ్ లు పెట్టి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని చెపుతూ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీకి అన్ని నిధులిచ్చాం, ఇన్ని నిధులిచ్చామని అమిత్ షా చెప్పారని అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే ఏపీకి కూడా ఇచ్చారని అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలని అన్నారు. అమ్మఒడి, చేయూత, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బీజేపీ ఇస్తుందా అని ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబుతో మీరు అంటకాగింది నిజమా, కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు జరిగిన అవినీతిలో బీజేపీ కూడా భాగస్వామేనని ఆరోపించారు. అమరావతి భూముల అవినీతిలో కూడా బీజేపీ పాత్ర ఉందని విమర్శించారు.


Next Story