ఎంపీడీఓపై వైసీపీ నేత దాడి.. నేడు క‌డ‌ప‌కు పవన్ కల్యాణ్

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.

By Medi Samrat  Published on  28 Dec 2024 7:52 AM IST
ఎంపీడీఓపై వైసీపీ నేత దాడి.. నేడు క‌డ‌ప‌కు పవన్ కల్యాణ్

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అనీ, ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని స్పష్టం చేశారు. గాలివీడు ఎంపీడీఓపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చించారు. కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని.. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించీ వాకబు చేసి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ నేప‌థ్యంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శనివారం కడప వెళ్లనున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు. శుక్ర‌వారం గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై మండల పరిషత్ కార్యాలయంలో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు తీవ్రస్థాయిలో దాడి చేశారు. దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

Next Story