ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పూర్తయింది. ఆయన పర్యటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన సీఎం చంద్రబాబు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాలని.. అయినా కూడా బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నారని నిలదీశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా ప్రధాని మోదీ, ఇతర మంత్రులతో ఒక్క హామీ మీద కూడా ప్రకటన చేయించలేక పోయారని వైఎస్ షర్మిల అన్నారు. గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన కూడా రాలేదన్నారు షర్మిల. బాబు గారు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచిది.. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు అడుకుంటుందని గుర్తిస్తే మంచిదన్నారు షర్మిల.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన ఆయన.. రాత్రి కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు తెలిపారు. ఇక బుధవారం ఉదయం సీఎం అధికారిక నివాసంలో పూజలు నిర్వహించి ఏపీకి తిరుగుప్రయాణమయ్యారు.