ఏపీలో కూడా రుణమాఫీ చేయండి : వైఎస్ షర్మిల

భారీ వర్షాలు ఒక విపత్తు.. చితికి పోయి ఉన్న రైతుల మీద పిడుగు పడ్డట్లు అయ్యిందని APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  22 July 2024 9:38 AM GMT
ఏపీలో కూడా రుణమాఫీ చేయండి : వైఎస్ షర్మిల

భారీ వర్షాలు ఒక విపత్తు.. చితికి పోయి ఉన్న రైతుల మీద పిడుగు పడ్డట్లు అయ్యిందని APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు చితికి పోయారని.. YSR ఉన్నప్పుడు వ్యవసాయం పండుగ అని.. రైతుకు వైఎస్ఆర్ పెద్ద పీట వేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు పక్షపాతి. YSR తలపెట్టిన జలయజ్ఞం జగన్ విస్మరించారన్నారు. ప్రాజెక్టు కట్టకపోగా ఉన్నవాటికి మరమత్తులు కూడా చేయ‌లేద‌న్నారు. సబ్సిడీ పథకాలను మొత్తం జగన్ ఎత్తేశాడని విమ‌ర్శించారు. అప్పు లేని రైతు అంటూ రాష్ట్రంలో లేడని.. ఇలాంటి రైతుల మీద ఇప్పుడు పడ్డ వానలు మళ్ళీ భారాన్ని మోపాయన్నారు. వర్షాలు భారీ ఎత్తున నష్టాన్ని మూటగట్టాయి. వేసిన పంటలు వేసినట్లే కొట్టుకు పోయాయి. మళ్ళీ పంటలు వేయలేని పరిస్థితి. ఇలాంటి రైతులను ఇప్పుడు కూటమి సర్కార్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితులపై ఆలోచన చేయాలన్నారు. కూటమి సర్కార్ అధికారంలో ఉన్నా బిజెపి మన రాష్ట్రంపై చిన్న చూపు చూస్తుంద‌న్నారు. NDRF బలగాలను పూర్తి స్థాయిలో పంపలేదన్నారు. ఏపీపై బిజెపి సవతి తల్లి ప్రేమ చూపిస్తుంద‌ని.. ఒక్క మేలు కాదు కదా అని మోసాలేన‌న్నారు. అలాంటి బిజెపి తో బాబు కూటమి గట్టారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోండని డిమాండ్ చేశారు.

ఇవి మామూలు వర్షాలు కాదు.. రాష్ట్ర విపత్తుగా పరిగణలో తీసుకోవాలి. ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. జరిగిన నష్టం పై వెంటనే లెక్కలు వేయండి. జరిగిన నష్టాన్ని రైతులకు పరిహారం గా ఇవ్వాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ అమలు చేసింది. ఏపిలో కూడా అధికారంలో వచ్చి ఉంటే 2 లక్షల రుణమాఫీ చేసే వాళ్ళం. తెలంగాణలో 40 లక్షల మంది రైతులు రుణ విముక్తులు అయ్యారు. YSR అమలు చేసినట్లే రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేశారు. ఇక్కడ ఎందుకు అమలు చేయరు అని చంద్రబాబును అడిగారు. మీ మ్యానిఫెస్టోలో రుణమాఫీ లేకపోవచ్చు. కానీ రైతుల కోసం రుణమాఫీ ఎందుకు అమలు చేయరు? అని ప్ర‌శ్నించారు.

అప్పు లేని రైతు రాష్ట్రంలో లేడు కదా.. రాష్ట్రంలో ప్రతి రైతు నెత్తిన కనీసం 2 లక్షల అప్పు ఉంది. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు ఉన్నారు. అందరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. కానీ ప్రయోజనం శూన్యం అన్నారు. మన ఎంపీలను బీజేపీ వాడుకుంటుంది.. కానీ ప్రయోజనం మాత్రం ఏమి ఉండదన్నారు. బీజేపీతో మాట్లాడి మన రైతులకు రుణమాఫీ అమలు చేయండని కోరారు. బీజేపీతో యుద్ధం చేయండి.. రుణమాఫీ తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

రేపు బడ్జెట్ పెడుతున్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు. అంతా షరా మామూలే. నిధులు కావాలని గుండెలు బాదుకున్నా ప్రయోజనం లేదు. ఈ సారి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పారు. ఏమైనా ప్రయోజనం ఉంటుందా ? పోలవరం పరిస్థితి ఏమిటి..నిధులు ఇస్తారా ? ఇవ్వరా ? రాజధాని పరిస్థితి ఏమిటి ? అని ప్ర‌శ్నించారు. రాజధాని కట్టాలి అంటే 1లక్ష కోట్లు కావాలి. వైజాగ్ స్టీల్ మీద క్లారిటీ లేదు. నష్టాల్లో ఉందా అని హేళన చేస్తున్నారు. ప్రైవేటీకరణ అని భయపెడుతున్నారు ప్రైవేటీకరణ అంటే ఒప్పుకునేది లేదు. విశాఖ స్టీల్ కి సొంత మైన్స్ కావాలి. విశాఖ స్టీల్ ను ఆదుకోవాలన్నారు. విశాఖ రైల్వే జోన్ కథ ఏమిటో తెలియదు. ఎప్పటి వరకు పూర్తి అవుతుందో తెలియదు. ఉత్తరాంధ్ర, రాయల సీమ వెనుక బడిన ప్రాంతల పరిస్థితి క్లారిటీ ఇవ్వాలని కోరారు.

లక్ష కోట్లు కావాలని బాబు అడిగాడు. ఏటా 1 లక్ష కోట్లు కేంద్రం ఇస్తే ఎలా సరిపోతుంది. విభజన నాటికి 15 లక్షల కోట్లు కేంద్రం నుంచి ఇవ్వాల్సి ఉందని అన్నారు. కడప స్టీల్ పై కేంద్రం క్లారిటీ ఇవ్వాలన్నారు. ప్రతి సారి ప్రత్యేక హోదా అంశం అటక ఎక్కుతుందన్నారు. 10 ఏళ్లుగా హోదా మీద పోరాటాలు జరుగుతున్నా పట్టింపు లేదన్నారు. ఒకప్పుడు మోడీ పై బాబు విమర్శ చేశారు. మట్టి కొట్టారు అని విమర్శ చేశారు. మరి ఇప్పుడు హోదా మీద ఏం చెప్తారని ప్ర‌శ్నించారు.

Next Story