ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో రహదారులు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కాగా.. మొత్తం 741 కిలోమీటర్ల పొడవునా రూ.10,401 కోట్లతో నిర్మించనున్న 31 రోడ్లకు ఈ నెల 17న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇప్పటికే రూ.11,157 కోట్లతో నిర్మించిన 20 రోడ్లను ప్రారంభించాల్సి ఉంది. ఈ నేఫథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 17న విజయవాడ రానున్నారు.
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని జాతీయ రహదారుల అభివృద్ధిపై ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. రాష్ట్రంలోని పోర్టులు, పర్యాటక ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను కలుపుతూ ప్రత్యేకంగా రహదారులను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీని వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని గడ్కరీ సూచించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు.
వాటిలో ఇప్పటికే కొన్ని పూర్తికాగా.. మరికొన్నింటిని నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకకాలంలో రోడ్ల ప్రారంభోత్సవాలు, కొత్త వాటికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో ఈ షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ నెల 17న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ తదితరులు పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరంగా చేస్తోంది.