కార్యకర్తల విషయంలో ఇప్పటి వరకు ఒకలా చూశాం.. ఇకపై మరోలా చూసుకుంటామని వైసీపీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని, అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు.ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ఒక నాయకుడిగా మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు దాన్ని నమ్ముతారు. ఆ మాట నిలబెట్టుకున్నామా? లేదా? అని చూస్తారు. అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుందన్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే రూ.1.72లక్షలకోట్లు ఇవ్వాలని చెప్పాను. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని సూచించాను. పులినోట్లో తలకాయపెట్టడమే అని చెప్పాను. ఆరోజు జగన్ కరెక్టుగానే చెప్పాడనుకునే పరిస్థితి ఇప్పుడు ఉందని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబుకు, జగన్‌కు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్ డెలివరీ జరిగేదని వైఎస్ జగన్ అన్నారు.