ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కాం అంటూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని, తనకు మరోసారి రాజ్యసభ అవకాశం ఉండదని తెలిసి కూడా మూడేళ్ల టర్మ్ ఉండగానే కూటమికి, చంద్రబాబుకు మేలు జరుగుతుందని తెలిసి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారన్నారు. ప్రలోభాలకు లొంగిపోయి తన సీటును అమ్మేసుకున్నారని, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్, వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుందని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను జైళ్లో పెట్టిన చరిత్ర లేదు. సీనియర్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, క్వార్ట్జ్, మైనింగ్, సిలికా వంటి అన్ని రంగాల్లో మాఫియాలు రాజ్యమేలుతున్నాయని జగన్ ఆరోపించారు. "మైనింగ్ నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారు. 4 గంటల పీక్ అవర్ కోసమంటూ 24 గంటలకు యూనిట్‌కు రూ.4.60 చొప్పున విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. మా హయాంలో రూ.2.49కే విద్యుత్ కొన్నాం, రాష్ట్ర ఖర్చు తగ్గించాం. ఇప్పుడు విద్యుత్ కొనుగోలులోనూ పెద్ద స్కామ్ జరిగింది" అని ఆయన వివరించారు. ఉర్సా అనే సంస్థకు బిడ్ లేకుండా రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారని, అమరావతి పేరుతో దోపిడీ స్కాములకు పరాకాష్టగా నిలిచిందని జగన్ ఆరోపించారు.