విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చాం: సీఎం జగన్
YS Jagan disburses Jagananna Vidya Deevena funds. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులను ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు.
By Medi Samrat Published on 24 May 2023 10:45 AM GMTYS Jagan disburses Jagananna Vidya Deevena funds
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులను ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. 2023 మార్చి త్రైమాసికానికి సంబంధించిన 703 కోట్ల రూపాయల నిధులను బటన్ నొక్కి 9.95 లక్షల మంది విద్యార్థుల తల్లి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. భావి తరాల పిల్లల తలరాతలు మార్చేందుకే ఈ విద్యా దివెన ఖర్చు అని, ఇవే మానవ వనరుల మీద పెట్టుబడులు అని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో దేశానికి దశ, దిశ ఆంధ్రప్రదేశ్ చూపిస్తుందని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా నర్సరీ నుంచి, ఉన్నత విద్యవరకూ విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని అన్నారు.
నాలుగేళ్ల మా ప్రభుత్వ పాలనలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ వాడిగా అడుగులేశాం. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు సామాజికంగాను, ఆర్థికంగానూ గట్టిగా నిలబడాలంటే, వారు వివక్ష సంకెళ్లను తెంచుకోవాలంటే.. దానికి చదువులు ఒక్కటే మార్గం అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. మా ప్రభుత్వం ఉన్నత విద్యలు కొనసాగించాలనుకునేవారికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలను అమలు చేస్తోందని, పూర్తి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి త్రైమాసికంలోనూ జమచేస్తున్నామని పేర్కొన్నారు సీఎం జగన్. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో అరకొరగా ఫీజులు చెల్లించారని టీడీపీపై ఎద్దేవా చేశారు. చంద్రబాబు రూ. 1777 కోట్ల రూపాయలు బకాయిపెట్టాడని, ఆడబ్బును కూడా మన ప్రభుత్వమే తీర్చిందని, బోర్డింగ్ ఫీజులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోందని, ప్రతి ఏటా వసతి దీవెన కింద రెండు మార్లు తల్లుల ఖాతాల్లోకి జమచేస్తున్నామన్నారు.