రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయి: జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు.
By Knakam Karthik
రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయి: జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయి. వ్యవస్థలను దిగజార్చుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలలో పారదర్శకత లోపించింది. విశాఖపట్నంలో సుమారు రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని ఎలాంటి గుర్తింపు లేని సంస్థకు కేవలం ఒక్క రూపాయికే కట్టబెట్టారు. అదేవిధంగా, లులూ గ్రూపునకు రూ.2,000 కోట్ల విలువైన భూమిని అప్పగించారని మండిపడ్డారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల అంచనాలను భారీగా పెంచి, ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. గతంలో రూ. 36 వేల కోట్లుగా ఉన్న పనుల అంచనాలను, సిమెంట్, స్టీల్ ధరలు పెరిగాయనే సాకుతో ఇప్పుడు రూ. 77 వేల కోట్లకు పెంచారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వంటి పారదర్శక విధానాలను తొలగించి, మొబిలైజేషన్ అడ్వాన్సులను తిరిగి తీసుకురావడం ద్వారా దోపిడీకి ఆస్కారం కల్పిస్తున్నారని..జగన్ విమర్శించారు.
రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టును ఖండిస్తున్నా. ఇది కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ఠ. ఎంపీ మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని, లేనిపోని ఆరోపణలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి అరెస్టులు, ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలు ఏమయ్యాయి.? ఆరోగ్యశ్రీని పూర్తిగా పక్కనపెట్టారు. రూ.3500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాల కింద గత ఏడాది రూ. 3,900 కోట్లు బకాయి పెట్టారు. ఈ ఏడాది కూడా చెల్లింపులు జరగడం లేదు. పెన్షన్ల సంఖ్యను తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు..అని జగన్ ఆరోపించారు.
మా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయడానికి బటన్ నొక్కామని, ఇప్పుడెందుకు అలా చేయడం లేదు..అని జగన్ ప్రశ్నించారు. బటన్ నొక్కితే డబ్బులు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళతాయని, మధ్యలో దోచుకోవడానికి ఏమీ ఉండదనే ఉద్దేశంతోనే చంద్రబాబు బటన్ నొక్కడం లేదని జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుండగా, ప్రభుత్వ పెద్దల జేబులు నిండుతున్నాయని జగన్ ఆరోపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో శ్రీ @ysjagan సమావేశం. pic.twitter.com/xZ4sGo6FLC
— YSR Congress Party (@YSRCParty) April 22, 2025