ఇటీవల ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీ నేతలకు వరుస బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నలుగురు వైసీపీ నేతలకు భద్రత పెంచుతూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, అంబటి రాంబాబులకి భద్రతను పెంచారు. 1+1 నుంచి 4+4కి భద్రతా సిబ్బంది పెంచారు. ప్రస్తుతం మంత్రి కొడాలి నానికి ఉన్న 2+2 భద్రతతో పాటు అదనంగా 1+4 గన్‌మెన్లతో భద్రతను పెంచుతూ రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
అలాగే కాన్వాయ్‌లో మరో భద్రతా వాహనానికి చోటు కల్పించింది. ఇటీవల అసెంబ్లీ పరిణామాలతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో ఈ నలుగురు నేతలకు బెదిరింపులు వచ్చాయి. ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. మరో వైపు ఏపీ శీతాకాల సమావేశాలు ఎన్నడూ లేని విధంగా చాలా వేడిగా కొనసాగుతున్నాయి. మూడు రాజధాలను బిల్లు ఉపసంహరణ, శాసనమండలి రద్దు, చంద్రబాబు కంటతడి పెట్టడం అసెంబ్లీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇటీవల మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు నిరసనకు దిగాయి.