అంబేద్కర్ నా హీరో.. ప్రజాసేవ చేస్తూనే ఉంటా: పవన్‌ కల్యాణ్‌

Will continue to serve people despite setbacks, says Janasena chief Pawan Kalyan

By అంజి  Published on  18 Sept 2022 2:34 PM IST
అంబేద్కర్ నా హీరో..  ప్రజాసేవ చేస్తూనే ఉంటా: పవన్‌ కల్యాణ్‌

ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజాసేవ చేస్తూనే ఉంటానని, వెంటనే అధికారంలోకి రావాలనేది తన ఆలోచన కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. ప్రభుత్వ నిర్ణయాలు విధాన ఆధారితంగా ఉండాలని, వ్యక్తిగతంగా ఉండకూడదని అన్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను పార్టీని వీడుతానని అందరూ అనుకున్నారని, తనకు ప్రజల కోసం పని చేయాలనే కోరిక ఉందని, డబ్బులు కావాలని కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంబేద్కర్ తన హీరో అని, మార్పు కోసం ప్రయత్నిస్తున్నానని అభిప్రాయపడ్డారు. వెనుకబడిన, అణగారిన కులాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వడంపై స్పందిస్తూ.. అప్పట్లో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కోసం అలా చేయాల్సి వచ్చిందన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించి మూడు రాజధానులను ప్రతిపాదించిన అధికార పార్టీ నాయకులపై మండిపడ్డారు. చట్ట సభల్లో బలం ఉందని ఏమైనా చేయొచ్చనే ధోరణి సరికాదని వైసీపీ నేతలకు కౌంటర్‌ ఇచ్చారు. 151 సీట్లు వచ్చింతా మాత్రాన మహాత్ములు అయిపోరని అన్నారు. పది మంది జనసేన ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వంపై పోరాడతామని, వచ్చే ఎన్నికల్లో జనసేన 45 నుంచి 67 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 2019లో ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు పర్యవసానం ప్రతీ ఒక్కరూ అనుభవిస్తున్నారని పవన్ అన్నారు.

బస్సు యాత్రపై పవన్‌ క్లారిటీ

బస్సు యాత్రపై పవన్‌ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో అక్టోబర్‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించాలనుకున్నామని, అయితే ఇప్పుడు బస్సు యాత్రను వాయిదా వేస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో తిరిగి బస్సు యాత్ర ప్రారంభ తేదీని మళ్లీ ప్రకటిస్తామని చెప్పారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 45 - 67 సీట్లకు మించి రావని అన్నారు. ప్రజలకు జనసేనపై ఆదరణ పెరుగుతోందన్నారు. గెలవాలన్న కసి ఉన్న అభ్యర్థులనే జనసేన తరఫున బరిలోకి దించుతామన్నారు. 2024లో జనసేనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను పవన్‌ కోరారు.

సీఎం జగన్‌ తన 300 ఎకరాల భూమిని కాపాడుకునేందుకు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఏపీ ప్రభుత్వ ఆస్తులను తెలంగాణకు సర్కార్‌కు కట్టబెట్టారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఒక కప్పు టీ తాగి ఆస్తులు అప్పగిస్తారా అని ప్రశ్నించారు.

Next Story