ఇక ఈ వైకుంఠపాళి వద్దు, గుజరాత్‌లో పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు

ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

By -  Knakam Karthik
Published on : 4 Oct 2025 9:19 PM IST

Andrapradesh, Cm Chandrababu,  Tdp, Ysrcp, Ap Government

ఇక ఈ వైకుంఠపాళి వద్దు, గుజరాత్‌లో పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు 

అమరావతి: ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని శనివారం సీఎం చంద్రబాబు ప్రారంభించి లబ్దిదారులకు చెక్కులు అందించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేలు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేశారు. రాష్ట్రంలోని 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.436 కోట్లు జమ చేశారు.

సభా ప్రాంగణంలో డ్రైవర్లు అందించిన ఖాకీ చొక్కాలను ధరించి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ...”కూటమి పాలనలో ప్రజల కష్టాలు తీరాయి. సంక్షేమం దరిచేరింది. ఉబర్, ర్యాపిడో వంటి యాప్ లు ఉన్నాయి. వీటి ద్వారా ఆటో డ్రైవర్లు కొంత మేర ఇబ్బంది పడుతున్నారు. వాటిని ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆటో డ్రైవర్ల కోసం ఓ యాప్ తెస్తాం. ఆ యాప్ ద్వారా ఆటో డ్రైవర్లకు బుకింగ్ లు వచ్చేలా చూస్తాం. కిరాయి కోసం ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తాం. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తాం. యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసమే ఖర్చు పెడతాం. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి... ఆటో డ్రైవర్ల భవిష్యత్తును మరింత మంచిగా తీర్చిదిద్దేలా పనిచేస్తాం. ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసమే ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఎవరికి లంచాలు ఇవ్వకుండా, కార్యాలయాలకు తిరగకుండా అర్హుల అందరి బ్యాoక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. అర్హులు ఏ ఒక్కరికి డబ్బులు జమ కాకపోయినా ప్రభుత్వానికి చెప్పండి... ఆర్హతను బట్టి ఖాతాలో వేస్తాం.”అని సీఎం చెప్పారు.

దుష్టశక్తులను అంతం చేసినందుకు దసరా, దీపావళి పండుగలు జరుపుకుంటాం. ఈ పండుగలను మనం స్పూర్తిగా తీసుకోవాలి. మన సంస్కృతిలో భాగమైన పండుగల్ని ఉత్సాహంతో చేసుకోవాలి. ఆ పండుగల సారాంశాన్ని గ్రహించాలి. రాష్ట్రానికి మళ్లీ దుష్ట శక్తులు రాకుండా జాగ్రత్త పడాలి. ఈ పండుగలు నేర్పించే పాఠాలను అర్థం చేసుకోవాలి. 16 నెలల క్రితం వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. పాలన ఎక్కడికక్కడ ఆగిపోయింది. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూడా గత పాలకులు నడవనీయలేదు. 16 నెలల క్రితం వరకూ పరదాలు కట్టుకుని, గోతులు తవ్వారు. ప్రజల్ని భయాందోళనలో ఉంచారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పేదల సంక్షేమంలోనూ డబ్బులు బొక్కేసిన వాళ్లు రాజకీయానికి పనికిరారు. ఇలాంటి దుష్టశక్తులు రాకుండా, ప్రజలకు చెడు జరగకుండా కాపాడుకోవాలి..అని సీఎం పేర్కొన్నారు.

మనకు ఇక ఈ వైకుంఠపాళి వద్దు. గుజరాత్ లో 25ఏళ్లుగా ఉన్న సుస్థిర పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి. కేంద్రంలో 15ఏళ్లుగా ఎన్డీఏ ఉన్నందునే ప్రజల కష్టాలు తీరాయి. వైకుంఠపాళీ వల్ల రాష్ట్రానికి ఇబ్బందులే అందుకే అలాంటి వారి పాలన మనకు వద్దు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అభివృద్ధి. 16 నెలల కాలంలో వ్యవస్థలను గాడిలో పెట్టాం. సంపద సృష్టించి పేదలకు పంచుతూ సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతంలో మాదిరిగా పరదాలు కట్టుకుని రాలేదు... ఆటోలో దర్జాగా వచ్చాం. 2024లో జరిగిన ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఈ స్ట్రైక్ రేట్ ఇంకా పెరగాలి.” అని ముఖ్యమంత్రి చెప్పారు.

Next Story