మోపాడు రిజర్వాయర్‌ కట్ట అడుగు భాగంలో లీకులు.. ఐదు గ్రామాలకు ముప్పు

Water leaks to Mopadu Reservoir in AP. ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. రిజర్వాయర్‌ కట్ట కింది భాగంలో నీరు లీకవుతోంది.

By అంజి  Published on  1 Dec 2021 12:17 PM IST
మోపాడు రిజర్వాయర్‌ కట్ట అడుగు భాగంలో లీకులు.. ఐదు గ్రామాలకు ముప్పు

ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. రిజర్వాయర్‌ కట్ట కింది భాగంలో నీరు లీకవుతోంది. దీంతో కట్ట కింది భాగంలో ఉన్న ఐదు గ్రామాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లైంది. ప్రకాశం జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో మోపాడు రిజర్వాయర్‌ పూర్తిగా నిండింది. అప్పటి నుండి అలుగు పారుతోంది. భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. మోపాడు రిజర్వాయర్‌లో 2.09 టీఎంసీల నీరు ఉంది. అయితే ఇవాళ ఉదయం రిజర్వాయర్‌ కట్ట అడుగు భాగంలో ఐదు చోట్ల నీరు లీకవుతుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ వెంటనే నీటి పారుదల శాఖ అధికారులకు రైతులు సమాచారం చేరవేశారు.

మోపాడు రిజర్వాయర్‌ కింద సుమారు 20 వేల ఎకరాల భూమి సాగు అవుతోంది. రిజర్వాయర్‌ దగ్గర నీరు లీకు అవుతుండటంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని పామూరు పాత చెరువు పూర్తిగా నిండిపోయింది. అలుగు పెద్ద ఎత్తున పారుతోంది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంటకమురళి, అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఇప్పటికే అలుగు మీద నుండి వస్తున్న వరద నీరు గోపాలపురం ఎస్సీ కాలనీని ముంచేసింది. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే ప్రజలను అప్రమత్తం చేశారు.

Next Story