విశాఖ మధురవాడలో పెళ్లి పీటలపై వధువు మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సృజనది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆమె పాయిజన్ తీసుకుని చనిపోయినట్లు ఇండస్ ఆస్పత్రి రిపోర్ట్ ఇచ్చిందన్నారు పోలీసులు. ఆమె బ్యాగులో గన్నేరు కాయల తొక్కు కనిపించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. సృజన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. ఈ కేసులో పలు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని గన్నేరు పప్పు తిని ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వెల్లడించారు. పెళ్లికి 3 రోజుల ముందు ఇన్స్‌స్టాగ్రామ్‌లో పరవాడకు చెందిన ప్రియుడు మోహన్‌తో చాటింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కావాలని మోహన్ సృజనను కోరినట్టు చెప్పారు. దీంతో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. పెళ్లి ఆపేందుకు సృజన విష పదార్థం తీసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సృజన మృతి చెందింది.