చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు రిజ‌ర్వు

టీడీపీ చీఫ్ చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు శుక్రవారం నాడు ముగిశాయి.

By Medi Samrat  Published on  6 Oct 2023 12:45 PM GMT
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు రిజ‌ర్వు

టీడీపీ చీఫ్ చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు శుక్రవారం నాడు ముగిశాయి. అక్టోబర్ 9వ తేదీకి తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. అక్టోబర్ 5న చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ ను ఏసీబీ కోర్టు రెండు వారాలకు పొడిగించింది.

చంద్రబాబు రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరుపున న్యాయవాదులు కోరారు. మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని సీఐడీ తరుపున న్యాయవాదులు కస్టడీ పిటీషన్ పై వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పు సోమవారం వెల్లడిస్తానని న్యాయమూర్తి చెప్పారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే చెప్పారు. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిన అనంతరం దూబే మాట్లాడుతూ... ఈ కేసులో ఇప్పటికే పదమూడు మంది బెయిల్‌పై ఉన్నారని తాము న్యాయస్థానంలో వాదనలు వినిపించినట్లు చెప్పారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఎక్కడా, ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

Next Story