వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 8, 9న నిర్వహించే మూడో ప్లీనరీకి ఏర్పాటు పూర్తవుతున్నాయి. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్లీనరీ నిర్వహించనున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావటంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మూడేళ్ల పాలనలో సాధించిన విజయాలతో పాటుగా రానున్న ఎన్నికలకు సీఎం జగన్ ప్లీనరీ వేదికగా సమరశంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. రేపు కడప పర్యటకు వెళ్తున్న సీఎం జగన్.. 8వ తేదీ ఉదయం ఇడుపుల పాయలో దివంగత వైఎస్సార్ కు నివాళి అర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ప్లీనరీలో పాల్గొంటారు.
ఇక వైసీపీ ప్లీనరీకి ఆ పార్టీ నాయకురాలు విజయమ్మ హాజరవుతారా అనే సందేహాలు ఉన్నాయి. తాజాగా ఆమె వస్తున్నారని ఇవాళ అధికారికంగా ప్రకటన వెలువడింది. రెండవ రోజు ప్లీనరీలో విజయమ్మ ప్రసంగించనున్నారు. ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు (30 నిమిషాల పాటు) ఆమె ప్రసంగిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు విజయమ్మ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే..! అయితే ఇప్పుడు ఆమె హాజరు కాబోతున్నారనే వార్త.. వైసీపీలో సరికొత్త జోష్ ను తీసుకుని వచ్చింది.