మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా చెప్పడంతో కృష్ణా జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తన తండ్రి వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాధా ఈ వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో వంగవీటి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధా పాల్గొన్నారు. ముగ్గురు నాయకులు కలిసి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభ జరిగింది. ఈ సభలో వంగవీటి రాధా ఉద్వేగ భరితంగా మాట్లాడారు. తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని, తనను ఏదో చేద్దాం అనుకునే వారిని చూసి భయపడనని వంగవీటి రాధా అన్నారు.
తాను దేనికైనా సిద్ధమేనని, ప్రజల మధ్యే తిరుగుతానన్నారు. తనను లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని రాధా అన్నారు. కాగా వంగవీటి రాధా తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. అయితే రాధా చేసిన ఎవరినుద్దేశించి చేసి ఉంటారని అంతా చర్చించుకుంటున్నారు. రాధాను చంపాల్సిన అవసరం ఎవరికుందని సర్వత్రా చర్చించుకుంటున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి వంగవీటి రాధా గుడివాడ నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ వారికి మంత్రి కొడాలి నాని స్వాగతం పలికారు. అనంతరం గుడ్లవల్లేరు మండలం వేమరంలోని కొండాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుండి చినగొన్నూరులో జరిగిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు హాజరయ్యారు.