భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డిఎకు ఎదురుదెబ్బ తగులుతుందని.. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు జోస్యం చెప్పారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేళ్లుగా దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రభుత్వంలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
2014, 2019 ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రధాని మోదీ నెరవేర్చలేదని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఆరోపించారు. అతను స్విస్ బ్యాంకుల నుండి తిరిగి డబ్బు తీసుకురాలేదు, ప్రతి భారతీయుడి ఖాతాలో ₹15 లక్షలు జమ చేయలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. అదే విధంగా మోదీ అనేక ఇతర హామీలను నిలబెట్టుకోలేదని.. అందుకే ఆయన మాటలను, వాగ్దానాలను ప్రజలు నమ్మరన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ని భారత యూనియన్‌లో విలీనం చేస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై హనుమంతరావు విమర్శలు గుప్పించారు. ఈ విషయంలో గత 10 ఏళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవబోతోందని వీహెచ్ చెప్పుకొచ్చారు.