ఏపీ రాజధాని అమరావతి.. స్పష్టం చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది.
By Medi Samrat Published on 4 Dec 2023 2:03 PM GMTఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను ఇప్పటికే ఆమోదించినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను విడుదల చేసిన కేంద్రం అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం కలిపించింది. రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ విధంగా సమాధానం ఇచ్చింది.
28 రాష్ట్రాల రాజధానుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఉందని, ఆ ప్లాన్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని కౌశల్ కుమార్ తెలిపారు. ఈ జాబితాలో అమరావతి కూడా ఉందని స్పష్టం చేశారు. అమరావతికి కూడా మాస్టర్ ప్లాన్ ఉందని మంత్రి వెల్లడించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కు కూడా కేంద్రం ఆమోదం ఉందని వివరించారు. దేశంలోని 39 శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని రాజ్యసభలో ఎంపీ జావెద్ అలీఖాన్ ప్రశ్నించారు. ఎంపీ జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇస్తూ.. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవం అన్నారు. ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని కేంద్రం తెలిపింది. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమాలు మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్ లను ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.