ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ వచ్చిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. సరదాగా స్నానం కోసం వెళ్లి కాలువలోకి దిగిన ఆరుగురు యువకుల్లో.. ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన కొయ్యలగూడెం మండల పరిధిలోని రాజవరంలో జరిగింది. గ్రామ శివారులో ఉన్న ఎర్రకాలువలో ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందారని పోలీసులు చెప్పారు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితులు.. సంక్రాంతి పండుగ సందర్భంగా రాజవరంలోని ఎర్రకాల్వలో స్నానం కోసం వెళ్లారు.
అందరూ కలిసి కాలువలోకి దిగారు. జెట్టి గణేష్, జెట్టి ముఖేష్‌లు కాసేపటికి కాలువలో లోతుకు వెళ్లారు. ఈత రాకపోవడం ఇద్దరు మృతి చెందారు. అలాగే లోతు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. మిగతా నలుగురు స్నేహితులు కాలువ గట్టుపైకి చేరి.. వెంటనే గ్రామస్తులకు సమాచారం చెరవేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకుని ఇద్దరు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. యువకులంతా చదువుకుంటున్నారని కొయ్యలగూడెం పోలీసులు తెలిపారు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.