రాష్ట్రంలో మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్లు : సీఎం చంద్రబాబు

పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు.. అవి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

By -  Medi Samrat
Published on : 7 Nov 2025 6:49 PM IST

రాష్ట్రంలో మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్లు : సీఎం చంద్రబాబు

పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు.. అవి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు..విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని సీఎం సూచించారు. శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్ఐపీబీ ఆమోదించింది. వీటి ద్వారా రూ. 1,01,899 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 85,570 ఉద్యోగాలు దక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన 16 నెలల్లో జరిగిన 12 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా మొత్తంగా రూ. 8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05,870 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...”రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యత. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధా కాకుండా తక్షణం ఆమోదం తెలియచేయాలి. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టే పరిశ్రమల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలి. క్షేత్ర స్థాయిలో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను త్వరితగతిన వచ్చేలా శ్రద్ధ పెట్టాలి. గత పాలకులు భూమి కేటాయించినా ఇప్పటికీ ప్రారంభం కాని ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో సమీక్షించాలి. ఏ ప్రాజెక్టులైనా నిర్మాణ పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలి. ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలి. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. చిప్, సెమీ కండక్టర్లు, డ్రోన్ వంటి పరిశ్రమలను ప్రోత్సహించాలి. రాష్ట్రంలో సుమారు 15 పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసుకుని... క్లస్టర్ వారీ విధానంతో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇలాంటి వాటిని గుర్తించి ప్రమోట్ చేయాలి. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు కొంచెం ఆలస్యమైనా... రాష్ట్ర ప్రభుత్వం వైపు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పెట్టుబడులు చేజారకుండా చూడాలి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై సంప్రదింపులు జరుపుదాం. పారిశ్రామిక అవసరాల నిమిత్తం... పరిశ్రమలకు విద్యుత్ సరఫరా విషయంలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రంతో కలిసి పని చేసే అంశాన్ని పరిశీలించాలి. ఇక ప్రభుత్వం కూడా పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ బ్యాంక్ సిద్దం చేసుకోవాలి. అలాగే ఎవరైనా ప్రైవేట్ ల్యాండ్ ఓనర్లు తమ భూములను పరిశ్రమలకు, కంపెనీలకు ఇవ్వడానికి ముందుకు వస్తే.. అలాంటి వారిని ప్రోత్సహించాలి.”అని ముఖ్యమంత్రి అన్నారు

మెగా సిటీలు... మాస్టర్ ప్లాన్లు

“రాష్ట్రంలో మూడు మెగా సిటీలు అభివృద్ధి చేయాలి. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖను మెగా సిటీగా అభివృద్ధి చేయాలి. అలాగే తిరుపతి, అమరావతి నగరాలను కూడా మెగా సిటీలు చేయాలి. ఇప్పటికే అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉంది. విశాఖ, తిరుపతి మెగా సిటీలకు కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ మెగా సిటీలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా చూడాలి. ఈ మేరకు టూరిజం, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు సమన్వయం చేసుకుని ఈ మెగా సిటీలు అభివృద్ధి జరిగేలా చూడాలి. అలాగే వీటికి టౌన్ షిప్స్ ఇంటిగ్రేషన్ జరగాలి, నివాసయోగ్యమైన నగరాలుగా తీర్చిదిద్దాలి. గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖకు మరిన్ని కంపెనీలు, పరిశ్రమలు రానున్నాయి. భవిష్యత్తులో విశాఖకు వచ్చే కంపెనీలకు భూ లభ్యత ఉండేలా చూసుకోవాలి. టూరిజం అభివృద్ధికి ఆతిధ్య రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రముఖ బ్రాండ్ లకు చెందిన హోటళ్లు నిర్మించేలా చూడాలి. రాష్ట్రంలో మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయి. దీనికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు మూడు కారిడార్లకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తాం. బీచ్ టూరిజాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి.”అని సీఎం చెప్పారు.

పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించాలి

ఈ నెల, 14, 15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఎస్ఐపీబీ ఆమోదించిన పరిశ్రమల్లో వేగంగా శంకుస్థాపనలు జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు ఆయా జిల్లాల్లో పరిశ్రమలకు శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇక ఇటీవల తాను జరిపిన విదేశీ పర్యటనల్లో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులను భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించానని.. వారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారని.. అలాగే భాగస్వామ్య సదస్సుకు వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని వివరించారు. విశాఖలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసం శెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

12వ SIPB సమావేశంలో ఆమోదించిన పెట్టుబడుల వివరాలు

1. రిలయన్స్ కన్న్యూమర్ ప్రొడక్స్ లిమిటెడ్ - రూ.202 కోట్లు - 436 మందికి ఉద్యోగాలు.

2. ఎపిటోమ్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.700 కోట్లు - 1,000 మందికి ఉద్యోగాలు.

3. NPSPL అడ్వాన్స్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.2,081 కోట్లు - 600 మందికి ఉద్యోగాలు

4. క్రయాన్ టెక్నాలజీ లిమిటెడ్ - రూ.1,154 కోట్లు - 1500 మందికి ఉద్యోగాలు

5. SCIC వెంచర్స్ ఎల్ఎల్పీ - రూ.550 కోట్లు - 1130 మందికి ఉద్యోగాలు.

6. ఇండిచిప్ సెమీ కండెక్టర్స్ లిమిటెడ్ - రూ.22,976 కోట్లు - 1241 మందికి ఉద్యోగాలు.

7. ఫ్లూయింట్‌గ్రిడ్ లిమిటెడ్ - రూ.150 కోట్లు - 2,000 మందికి ఉద్యోగాలు

8. మథర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ - రూ.110 కోట్లు - 700 మందికి ఉద్యోగాలు

9. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.115 కోట్లు - 2000 మందికి ఉద్యోగాలు

10. కె.రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.2,172 కోట్లు - 9,681 మందికి ఉద్యోగాలు

11. విశాఖ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.2,200 కోట్లు - 30 వేల మందికి ఉద్యోగాలు

12. ఐ స్పేస్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.119 కోట్లు - 2,000 మందికి ఉద్యోగాలు

13. SAEL సోలార్ పీ12 ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1728 కోట్లు - 860 మందికి ఉద్యోగాలు

14. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ - రూ.7972 కోట్లు - 2,700 మందికి ఉద్యోగాలు

15. మైరా బే వ్యూ రిసార్ట్స్ - రూ.157 కోట్లు - 980 మందికి ఉద్యోగాలు.

16. విశ్వనాథ్ స్పోర్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.51 కోట్లు - 750 మందికి ఉద్యోగాలు

17. సుగ్నా స్పాంజ్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1247 కోట్లు - 1,100 మందికి ఉద్యోగాలు

18. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ - రూ.8570 కోట్లు - 1000 మందికి ఉద్యోగాలు

19. వాల్ట్సన్ ల్యాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1682 కోట్లు - 415 మందికి ఉద్యోగాలు

20. ఏఎమ్‌జీ మెటల్స్ అండ్ మెటీరియల్స్ లిమిటెడ్ - రూ.44,000 కోట్లు - 3000 మందికి ఉద్యోగాలు

21. వాసంగ్ ఎంటర్ ప్రైస్ - రూ.898 కోట్లు - 17,645 మందికి ఉద్యోగాలు

22. బిర్లాను లిమిటెడ్ - రూ.240 కోట్లు - 588 మందికి ఉద్యోగాలు

23. సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - రూ.1,090 కోట్లు - 1250 మందికి ఉద్యోగాలు

24. భారత్ డైనమిక్స్ - రూ.489 కోట్లు - 500 మందికి ఉద్యోగాలు

25. డాజ్కో ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1234 కోట్లు - 1454 మందికి ఉద్యోగాలు

26. శ్రీవేదా ఇన్నోవేషన్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.12 కోట్లు - 1500 మందికి ఉద్యోగాలు

Next Story