తిరుమల లడ్డూ కేసులో ట్విస్ట్..ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టులో సవాల్

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కింది.

By -  Knakam Karthik
Published on : 22 Feb 2026 3:51 PM IST

Andrapradesh, Tirumala Laddu Row, Subramanian Swamy, Supreme Court, Chandrababu, SIT, Tirupati, TTD

తిరుమల లడ్డూ కేసులో ట్విస్ట్..ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టులో సవాల్

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగుతుండగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిట్ విచారణకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో సొంత కమిటీని ఏర్పాటు చేయడం కోర్టు దిక్కారమేనని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను రేపు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, సిట్, సిబిఐ మరియు టీటీడీలను ప్రతివాదులుగా చేర్చారు.

శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ (NDRI) మరియు ఎన్డీడీబీ (NDDB) నివేదికలు స్పష్టం చేసినట్లు, అలాగే సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో కూడా వైఎస్సార్‌సీపీ నేతల ప్రమేయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని సమాచారం. కల్తీ జరిగిందనే ఆరోపణలు నిలవకపోవడంతో, ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమకు అనుకూలంగా నివేదికలు ఇప్పించుకోవడానికి, బెదిరింపులతో అబద్ధపు వాంగ్మూలాలు సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా ఈ ఏకసభ్య కమిటీని నియమించారని పిటిషనర్ ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ పరిధిని కాదని, దర్యాప్తును ప్రభావితం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు.

Next Story