పంచలోహ విగ్రహాల పేరుతో ఇత్తడి విగ్రహాలను విక్రయిస్తున్న అంతర్ జిల్లా మోసగాళ్లను అరెస్టు చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా మిడుతూరు మండలానికి చెందిన ముల్లా అక్బర్ బాషా, పాణ్యానికి చెందిన పిక్ అక్బర్, బనగానపల్లికి చెందిన శాలిబాషాలు ముఠాగా ఏర్పడి మంగళవారం రాత్రి తాడిపత్రిలో పంచలోహ విగ్రహాలుగా పేర్కొంటూ ఇత్తడి విగ్రహాలను విక్రయించేందుకు ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న సీఐ కృష్ణారెడ్డి, ఎస్‌ఐ ధరణిబాబు అక్కడికి చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 12 ఇత్తడి విగ్రహాలు, రూ.5,800 వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు తాడిపత్రి మండలం సజ్జలదిన్నె సమీపంలో మట్కా నిర్వహిస్తున్న 14 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. 15 మొబైల్ ఫోన్లతో పాటు రూ. 5,76,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఓబులేసు, ఇమామ్‌వలి, హాజీ ముస్తఫాతో పాటు మరో 11 మంది ఉన్నారు.