భూములు లేని పేదలు, అనాథ పిల్లలకు పింఛన్లు..ఏపీ కేబినెట్ నిర్ణయాలివే!
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 35 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By - Knakam Karthik |
భూములు లేని పేదలు, అనాథ పిల్లలకు పింఛన్లు..ఏపీ కేబినెట్ నిర్ణయాలివే!
అమరావతి: రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 35 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో పిడుగురాళ్ల వైద్యకళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఎస్వీ వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి పలమనేరులో లైవ్‌స్టాక్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతి యర్రాజికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం, డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదించింది. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి 4,451 కోట్లు ప్రభుత్వ రుణ గ్యారెంటీని కేబినెట్ ఆమోదించింది.
అటు రాజధాని అమరావతి పరిధిలో వీధిపోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరును ఆమోదించింది. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్‌గ్రేడ్‌కు, పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది. అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్‌స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్కు ఏర్పాటుకు భూకేటాయింపులకు కేబినెట్ ఆమోదించింది. పలు జలవనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులకు ఆమోదం తెలిపింది. ఇంధనశాఖలో పలు పరిపాలన అనుమతులకు ఆమోదించింది. తిరుపతి, విశాఖపట్నంలో శిల్పారామం ప్రాజెక్టుల కోసం ఎం&ఎస్ గార్డెన్‌సిటీ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్‌కు జారీ చేసిన ఎల్వోఐలను రద్దు చేసి, కొత్తగా ఈవోఐలను ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం & వినోద జోన్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. పీఎంవై(యూ) మౌలిక సదుపాయాల పనులను రద్దు చేసి, తిరిగి టెండర్లు పిలవడం, రూ.226.36 కోట్ల సవరించిన అనుమతిని ఆమోదించింది. శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ చట్టం, 2006 లోని “లెప్రసీ” (Leprosy) అనే పదాన్ని తొలగిస్తూ సవరణకు ఆమోదం తెలిపింది. ఏపీఎస్బీసీఎల్(APSBCL) రుణాల ద్వారా వనరుల సమీకరణకు సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జారీ చేసిన మెమోలను ఆమోదించింది. ద్వారకాతిరుమలలో శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ (సవరణ) బిల్లు, 2026ను రాష్ట్ర శాసనసభ ముందు ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం అనుమతి తెలిపింది.